Latest News
సైబర్ నేరగాళ్ల టోకరా...వాట్సాప్ మేసేజ్‌తో రూ.1.20 కోట్లు మాయం
posted on: Mar 21, 2026 9:15PM
.webp)
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు మరోసారి కొత్త పద్ధతి ద్వారా మోసాలకు తెరలేపారు. ఇప్పుడు తాజాగా ప్రముఖ వ్యాపార వేత్తలను టార్గెట్ చేసుకొని రంగంలోకి దిగారు.... సైబర్ నేరగాళ్లు మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనుమరాలిని లక్ష్యంగా చేసుకుని, ఆమె పేరుతో నకిలీ వాట్సాప్ సందేశాలు పంపి రూ.1.20 కోట్లను దోచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బాధితురాలు ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్త. ఆమె 18 కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యక్తిగత వివరాలు, ఫోటోలను సేకరించిన సైబర్ నేరగాళ్లు, వాట్సాప్‌లో నకిలీ ప్రొఫైల్ సృష్టించారు.
ఈ నెల 13న ఆ నకిలీ ఖాతా ద్వారా ఆమె అకౌంటెంట్‌కు సందేశం పంపారు. “మీటింగ్‌లో ఉన్నాను… అత్యవసరంగా చెప్పిన ఖాతాకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయాలి” అంటూ ఆదేశాలు జారీ చేశారు. సందేశంలో ఆమె పేరు, ఫోటో ఉండటంతో నిజమేనని నమ్మిన అకౌంటెంట్, ఎటువంటి అనుమానం లేకుండా, కనీసం ఆ మహిళా వ్యాపారవేత్తను అడగకుండా ఒకే లావాదేవీలో 1.20 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అనంతరం ఆ విషయాన్ని అకౌంటెంట్ వాళ్ళ మేడంకి చెప్పలేదు.
అయితే ఇదే తరహాలో ఈ నెల 17న మరోసారి డబ్బు పంపాలని సందేశం రావడంతో, ఈసారి అకౌంటెంట్ అప్రమత్తమయ్యాడు. చెక్ అప్రూవల్ కోసం నేరుగా మహిళ వ్యాపారవేత్తను సంప్రదించాడు. గతంలో పంపిన డబ్బు విషయాన్ని తెలియజేయడంతో, ఆమె ఒక్కసారిగా అవాక్కయింది. తాను ఎలాంటి సందేశాలు పంపించలేదని డబ్బులు అడగలేదని ఆమె స్పష్టం వ్యక్తం చేసింది. దీంతో అసలు మోసం బయట పడింది. ఇది సైబర్ నేర గాళ్లు పని అయిఉంటుందని గ్రహించిన బాధితురాలు తక్షణమే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించి, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించినట్లు సమా చారం. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు కేరళకు వెళ్లినట్లు తెలిసింది. ఇటీవల ఇలాంటి మోసాలు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు చేసే ముందు, ఫోన్ కాల్ లేదా ప్రత్యక్షంగా నిర్ధారణ చేసుకోవాలని సూచిస్తున్నారు. అపరిచిత ఖాతాలకు డబ్బులు పంపేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలని తెలిపారు. రోజురోజుకి టెక్నాలజీ పెరిగిన కొద్దీ నేరగాళ్ల కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని, ఒక్క నిర్లక్ష్యం భారీ నష్టాలకు దారి తీస్తుం దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.






