జగన్‌‌కు మరో ఝలక్‌..? మరో రెండు వికెట్లు డౌన్‌..!

posted on: May 8, 2017 12:33PM


 

ఇప్పటికే 21మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి... తెలుగుదేశంలో చేరిపోయారు. ఈ వలసల పరంపర ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయముంది, ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే... వచ్చే ఏడాదే జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలాంటి పరిస్థితిలోనూ వైసీపీ ఎమ్మెల్యేలు గోడ దూకేందుకే మొగ్గుచూపుతున్నారు. అయితే ఈసారి తమదే అధికారమంటోన్న జగన్‌... వలసపోతున్న ఎమ్మెల్యేలను ఆపలేకపోతున్నారు. ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు జగన్‌కు ఝలక్‌ ఇఛ్చేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర నుంచే జగన్‌కు ఝలక్‌ తగలనుందని అంటున్నారు. శ్రీ‌కాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, విజ‌య‌న‌గ‌రం జిల్లా పాల‌కొండ ఎమ్మెల్యే క‌ళావ‌తి... వైసీపీని వీడుతారనే ప్రచారం ఎప్పట్నుంచో సాగుతున్నా.... అది నిజం కాబోతుందని అంటున్నారు. శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన మంత్రి ....ఈ ఇద్దరు ఎమ్మెల్యేల‌ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

 

వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని జగన్‌ చెబుతున్నా.... ఎమ్మెల్యేలు మాత్రం అధికార పార్టీ వైపు చూడటం వైసీపీ శ్రేణులను కలవరపెడుతోంది. దాంతో ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారకుండా నచ్చజెప్పే బాధ్యతను, వలసలను నియంత్రించే బాధ్యతను జిల్లాల వారీగా సీనియర్లకు జగన్‌ అప్పగించినట్లు తెలుస్తోంది. పార్టీ మారాలనుకుంటోన్న ఎమ్మెల్యేల సమాచారాన్ని ఇఫ్పటికే తెప్పించుకున్న జగన్‌.... ఎమ్మెల్యేలు చేజారకుండా బుజ్జగింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు రానున్నాయ‌ని, అధికారంలోకి వ‌చ్చేది మ‌న పార్టీయేనని, ఇప్పటికే టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు అనేక అవ‌మానాలు ఎదుర్కొంటున్నార‌ని గుర్తు చేస్తున్నారు. అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక‌త ఉంద‌ని, ఈ స‌మ‌యంలో పార్టీ మారితే వ్యక్తిగతంగా న‌ష్టపోతారంటూ ఎమ్మెల్యేల‌ను జ‌గ‌న్ హెచ్చరిస్తున్నారు.

 

పార్టీ మారకుండా ఎమ్మెల్యేలను బుజ్జగిస్తూనే, మరోవైపు పార్టీ మారిన నేతల తీరును ప్రజల్లో ఎండగట్టాలని జగన్‌ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా రాజకీయంగా దెబ్బ తీయాలని జ‌గ‌న్ భావిస్తున్నారు. నియోజకవర్గాల్లో సభలు నిర్వహించి... పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎండగట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...