జగన్ చంద్రబాబుకు క్షమాపణలు చెబుతాడా..?

posted on: Jun 4, 2016 12:41PM

 

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఒకదాని తరువాత ఒకటి కష్టాలు ఎదురవుతున్నట్టు ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు పార్టీ మారుతూ.. దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటే.. ఇప్పుడు ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్రకు కూడా అడ్డంకులు వచ్చి పడ్డాయి. ఎప్పుడూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై విరుచుకుపడే జగన్ ఎప్పటి లాగే రెండు రోజుల క్రితం జరిగిన ఒక సభలో ఆయనపై తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని చెప్పులతో కొట్టాలనే పదజాలం వాడుతూ ఆయనను విమర్శించారు. ఇక అంతే ఈ మాటలు విన్న తెలుగు తమ్ముళ్లు ఊరుకుంటారా ఇప్పుడు వైఎస్ జగన్ పై తిట్ల పురాణం మొదలుపెట్టారు.

 

ఈ నేపథ్యంలోనే ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్రను అడ్డుకుంటున్నారు. నిన్న అనంతపురం జిల్లా యాడికిలో యాత్ర నిర్వహించడానికి వెళ్లిన ఆయనకు నిరాశే ఎదురైంది. అనంతపురం తమ కోటగా భావించే జేసీ ప్రభాకర్ రెడ్డి ఊరుకుంటాడా. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 కార్లతో జగన్ యాత్రను అడ్డుకోవడానికి వెళ్లారు. ఇక జేసీ నోటి గురించి చెప్పక్కర్లేదు. ఏది అనాలనిపిస్తే అది ముఖం మీద చెప్పేయడం.. తిట్టాలనిపిస్తే తిట్టేయడం వారి నైజం. ఈ క్రమంలోనే ఆయన జగన్ పై తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చాడు. రైతు భరోసా యాత్ర పేరిట పర్యటిస్తున్న నిన్ను పది నిమిషాల్లోనే ప్రజల చేత చెప్పులతో కొట్టిస్తే ఏం చేస్తావని, ముఖ్యమంత్రిని కాదు ప్రజలు నిన్ను చెప్పులతో కొట్టి ఊరేగించే కాలం ఆసన్నమైందని ధ్వజమెత్తారు. చంద్రబాబును విమర్శిస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఈరోజు కదిరిలో కూడా అదే పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా ఆయన యాత్రను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. చంద్రబాబుకు జగన్ క్షమాపణలు చెబితే కాని యాత్ర చేయడానికి వీల్లేదు అని డిమాండ్ చేస్తున్నారు.

 

ఇక టీడీపీ సీనియర్ నేతలైతే జగన్ పై మండిపడుతున్నారు.  జగన్‌ మానసిక పరిస్థితి బాగోలేదని.. ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండటంతో జగన్‌కు మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ని ప్రజలు రాళ్లతో కొట్టి ఇంటికి పంపుతారని అంటున్నారు. జగన్ ను ప్రజలు చెప్పులతో కొడతారు అని అంటున్నారు. మరి టీడీపీ తమ్ముళ్లు కోరినట్టు జగన్ క్షమాపణలు చెబుతారో లేదా చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...