అందుకే సెక్షన్: 8పై వైకాపా పోరాడట్లేదుట!

 

రాష్ట్ర విభజన జరిగిన తరువాత నుండి నేటి వరకు రెండు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు ఏర్పడ్డాయి. ఏర్పడుతూనే ఉన్నాయి. తెలంగాణాలో ఉన్న రాజకీయ పార్టీలు తమ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తుంటే ఆంద్రప్రదేశ్ లో మాత్రం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నడుస్తున్న వై.యస్సార్ పార్టీ రాష్ట్ర, ప్రజల ప్రయోజనాలకు భంగం కలుగుతున్నా నోరు మెదపకపోవడమే కాక రాష్ట్రంలో పొరుగు రాష్ట్ర ప్రతినిధిలా వ్యవహరిస్తూ, పొరుగు రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడుతూ, పొరుగు రాష్ట్ర నేతలతో కలిసి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికే ఎసరు పెట్టేయాలని ప్రయత్నించడం చాలా దురదృష్టకరం.

 

సెక్షన్: 8 అమలు విషయంలో తెలంగాణాలో అన్ని పార్టీలు ఒక్క త్రాటిపైకి తమ హక్కులను కాపాడుకొనేందుకు పోరాడుతుంటే, ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్, వైకాపాలు ఈ విషయంపై నోరు మెదపడం లేదు. పైగా సెక్షన్: 8 గురించి తెదేపా ప్రభుత్వం పట్టుబట్టడాన్ని రెండు పార్టీలు విమర్శిస్తున్నాయి. అలాగని దైర్యంగా తమ పార్టీలు సెక్షన్: 8ని వ్యతిరేకిస్తున్నాయని కూడా చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ దానిని గట్టిగా వ్యతిరేకించకపోవడనికి రెండు కారణాలున్నాయి. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వమే స్వహస్తాలతో విభజన చట్టం తయారుచేసి అందులో సెక్షన్: 8ని పెట్టడం చేత కాంగ్రెస్ నేతలు దానిని వ్యతిరేకించలేకపోవడం ఒక కారణమయితే, తెలంగాణాలో ఎంతో కొంత బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు సెక్షన్: 8ని వ్యతిరేకిస్తుంటే, తాము దానిని సమర్ధించడం వల్ల వారికి సమస్యలు ఎదురవుతాయనేది రెండవ కారణం.

 

కానీ తెలంగాణాలో ఏమాత్రం పట్టులేని వైకాపా కూడా సెక్షన్: 8ని ఎందుకు వ్యతిరేకిస్తోంది? అంటే బహుశః తెరాస దానిని వ్యతిరేకిస్తోంది గనుకనే అని సమాధానం చెప్పుకోవలసివస్తుంది. కానీ తెరాసను మంచి చేసుకొనే ప్రయత్నంలో ఆ పార్టీ ఆంధ్రాలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొంటోందనే విషయం మరిచిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక సెక్షన్: 8పై ఆ పార్టీ అభిప్రాయం ఏమిటో ఆ పార్టీకి చెందిన మీడియాలో చూస్తే స్పష్టమవుతుంది. కానీ వైకపా నేతలు మాత్రం కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లుగా సెక్షన్: 8 గురించి చాలా లౌక్యంగా మాట్లాడుతున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే రాజేంద్ర నాధ్ రెడ్డి దీనిపై ఇచ్చిన స్టేట్ మెంట్ గమనించినట్లయితే ఆ విషయం అర్ధమవుతుంది.

 

ఆయన మీడియాతో మాట్లాడుతూ “ అసలు సెక్షన్: 8 విభజన చట్టంలోని ఉంది. అంటే అది ఇప్పటికే అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. అటువంటప్పుడు మళ్ళీ దాని గురించి తెదేపా నేతలు పనిగట్టుకొని ఎందుకు పోరాటాలు చేస్తున్నారో అందరికీ తెలుసు. గవర్నర్ నరసింహన్ విభజన చట్టంలో ఉన్న ఇటువంటి అంశాల గురించి తనకు సలహా ఇచ్చేందుకు ఇద్దరు సలహాదారులను కూడా నియమించుకొన్నారు. కనుక తెదేపా నేతలు తమ సమస్యల నుండి బయటపడటానికి సెక్షన్: 8 గురించి పోరాటాలు చేయడం అర్ధరహితం,” అని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu