సెక్షన్: 8పై కూడా ద్వంద వైఖరేనా?

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి అనేక అంశాల మీద ద్వంద వైఖరి అవలంభించడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు సెక్షన్: 8 అమలు చేయడంపై కూడా అదే విధంగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ “సెక్షన్‌-8కు తాము వ్యతిరేకం కాదని, దాన్ని అమలు చేయాలని కోరుతున్నామని,” అన్నారు. అంటే అదే వైకాపా వైఖరని నమ్మితే అమాయకత్వమే అవుతుంది.

 

ఆ పార్టీ స్వంత మీడియాలో అందుకు పూర్తి భిన్నమయిన చర్చలు జరుగుతున్నాయి. సెక్షన్: 8ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెరాస నేతలను, జీవన్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలను, అది తప్పని వాదించే న్యాయ నిపుణులను స్టూడియోకి ఆహ్వానించి దానిని అమలు చేయడం శుద్ధపొరపాటనే భావన ప్రచారం చేస్తోంది. అయితే దానర్ధం ఈ విషయంలో కూడా వైకాపా తెరాసకు మద్దతు తెలుపుతున్నట్లు కాదని చెప్పేందుకు, “తమ పార్టీ ఇద్దరు ముఖ్యమంత్రులకు సమాన దూరం పాటిస్తోందని” జ్యోతుల నెహ్రు చెప్పడం విశేషం.

 

ఒకవేళ జ్యోతుల నెహ్రూ చెపుతున్నట్లు వైకాపా గనుక సెక్షన్: 8ని అమలుచేయాలని కోరుకొంటున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాలకు అద్దం పట్టే వారి మీడియా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. కానీ వైకపా నేతలొక మాట, వారి మీడియా మరొక రకమయిన భావనలు వ్యాపింప జేయాలని ప్రయత్నించడం గమనిస్తే, వారి మీడియా చెపుతున్నదే వైకాపా అసలు వైఖరి అని అర్ధమవుతుంది. కానీ ఆ మాట కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పినట్లయితే ‘వైకాపాకు తెరాసతో రహస్య సంబంధాలున్నాయని, ఆంద్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తోందని’ తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలను బలపరిచినట్లవుతుంది. ఒకవేళ వైకాపా కూడా సెక్షన్: 8ని తెదేపా నేతలంత తీవ్రంగా వ్యతిరేకిస్తే ఆ పార్టీకి తెరాసతో ఉన్న సంబందాలు చెడుతాయి కనుక వైకాపా నేతలు ఏదో మొక్కుబడిగా సెక్షన్: 8ని సమర్ధిస్తున్నట్లు మాట్లాడుతున్నారు. కానీ వారి మీడియా ద్వారా తమ పార్టీ సెక్షన్: 8కి వ్యతిరేకమని చాలా స్పష్టమయిన సంకేతాలే అందిస్తున్నారు.

 

ఇదివరకు కూడా అనేక అంశాల మీద ఇటువంటి ద్వంద వైఖరి అవలంభించినందుకే వైకాపా అనేకసార్లు ఎదురుదెబ్బలు తింది. అయినా తన (ద్వంద) వైఖరిని మార్చుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని రాజకీయ వర్గాలలో అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu