వైసీపీ గొంతులో బడ్జెట్ వెలక్కాయ!
posted on: Jul 10, 2014 5:28PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శించడమే తక్షణ కర్తవ్యంగా పెట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన బీజేపీ కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో వ్యతిరేకంగా వ్యాఖ్యానించడానికి వీల్లేని పరిస్థితుల్లో వుంది. తన పాత అలవాటు ప్రకారం బడ్జెట్‌ని విమర్శించాలని మనసులో వున్నప్పటికీ ఆ పని చేయలేకపోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత తెలుగుదేశం ఎంపీలు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం బడ్జెట్ చాలా బాగుందని, ఆంధ్రప్రదేశ్‌కు వరాలు కురిపించడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఇంకా కొన్ని వరాలు ఇస్తే బాగుండేదని, అయితే ఒకేసారి అన్నీ అడగటం కూడా భావ్యం కాదని అభిప్రాయపడ్డారు. వైసీపీ పద్ధతి ఏమిటంటే, తెలుగుదేశం పార్టీ ఎడ్డెం అంటే తాను తెడ్డెం అనడం. టీడీపీ బడ్జెట్ బాగుందని అన్నది కాబట్టి వైసీపీ బాగాలేదని అనాలి. టీడీపీ ఎంపీలు బడ్జెట్ బాగుందని అన్నారు కాబట్టి వైసీపీ ఎంపీలు బాగాలేదని చెప్పాలి. కానీ వారు ఆ పని చేయలేదు. వైసీపీ ఎంపీలు, నాయకులు కేంద్ర బడ్జెట్ పర్లేదన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు జగన్ వున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించి లేనిపోని శత్రుత్వం తెచ్చుకోవడం కంటే, పూర్తి స్వింగ్‌లో వున్న కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడి సేఫ్‌గా వుండటమే మంచిదని భావిస్తున్నట్టున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అందుకే కేంద్ర బడ్జెట్ మీద వైసీపీ నాయకులు వ్యతిరేకతను ప్రదర్శించడం లేదని భావిస్తున్నారు. మొత్తమ్మీద వైసీపీ నాయకులకు బడ్జెట్‌ని విమర్శించాలని వున్నా, విమర్శించలేకపోతున్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం బడ్జెట్ వైసీపీ నాయకుల గొంతుల్లో వెలక్కాయ మాదిరిగా తయారైంది.



.jpg)


.webp)



