వైకాపా నేతలు రైతులను రెచ్చగొడుతున్నారు: నారాయణ

 

ఏపీ రాజధాని కోసం దాదాపు 98శాతం భూసమీకరణ పూర్తయింది. కానీ మరో 2 శాతం భూమి మాత్రమే సమీకరించవలసి ఉంది. మంత్రి నారాయణ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూములు సేకరించబోతున్నట్లు ప్రకటించినప్పటి నుండి తుళ్ళూరు మండలంలో చాలా మంది రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. వారికి ప్రభుత్వంపై నమ్మకం ఉండబట్టే తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారు. కానీ వైకాపా నేతలు తమకు పట్టున్న గ్రామాలలో తిరుగుతూ రైతులను భూములు ఇవ్వవద్దని రెచ్చగొడుతున్నారు. అందుకే కొద్ది మంది రైతులు మాత్రం భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. కానీ గత రెండు రోజుల్లో తుళ్ళూరులో సుమారు 50 ఎకరాలను రైతులు ల్యాండ్ పూలింగ్ పద్దతిలో ప్రభుత్వానికి ఇచ్చేరు. గ్రామ కంఠం భూముల సమస్యని పరిష్కరిస్తే మరో 265 ఎకరాలు ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేసారు. కనుక ప్రభుత్వం ఈ సమస్యను సామరస్యంగానే పరిష్కరించుకొని ముందు వెళుతుంది తప్ప రైతులను బాధ పెట్టి ముందుకు వెళ్ళాలనుకోవడం లేదు. నేటికీ చాలా మంది రైతులు తమ భూములను ఇచ్చేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తున్నందున భూసేకరణ కోసం నోటీసులు ఇవ్వకుండా నిలిపివేశాము. కానీ వైకాపా నేతలు రైతులను రెచ్చగొట్టి సమస్యను సృష్టించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చే ప్రతీ రైతుకి ఎటువంటి నష్టం కలగకుండా, వారి కుటుంబాలకు ఆర్ధిక భద్రత కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కనుక రైతులు వైకాపా నేతల మాటలు నమ్మి ఈ ఆఖరి అవకాశాన్ని జారవిడుచుకోవద్దని” ఆయన రైతులకు విజ్ఞప్తి చేసారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu