వైకాపా వితండ వాదన
posted on Jul 22, 2015 5:38PM
.jpg)
ఇంతవరకు తెదేపా నేతలు వైకాపాని పిల్ల కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేసేవారు. కానీ ఇప్పుడు వైకాపాయే తల్లి కాంగ్రెస్ పార్టీని ‘పిల్ల తెదేపా’ అని విమర్శిస్తోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు తమ ఓట్లన్నిటినీ తెదేపాకి మళ్ళించి చంద్రబాబు అధికారంలోకి రావడానికి తోడ్పడ్డారని వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తాజాగా ఆరోపిస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ “పిల్ల తెదేపా”లా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత ఘోరంగా ఓడిపోయిందో, ఎందుకు నామ రూపాలు లేకుండా పోయిందో అందరికీ తెలుసు. తమ అభీష్టానికి విరుద్దంగా రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే పంతంతో, విభజనతో పూర్తిగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గాడిన పెడతారనే నమ్మకంతోనే ప్రజలు తెదేపాకి పట్టం కట్టారని అందరికీ తెలుసు. ప్రజలలో నెలకొన్న కాంగ్రెస్ వ్యతిరేకత తనకూ అనుకూలిస్తుందని ఆశించిన జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ గెలుపుపై చాలా ధీమా ప్రదర్శించారు. కానీ చివరికి ప్రజలు చంద్రబాబు నాయుడు వైపే మ్రోగ్గు చూపారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్క ముక్క మాట్లాడని వైకాపా ఇప్పుడు రాష్ట్రంలో కనబడకుండా పోతున్న కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ‘పిల్ల తెదేపా’ అని అభివర్ణించడం విడ్డూరంగా ఉంది.