మరీ అన్ని తప్పటడుగులా జగన్?
posted on May 13, 2015 2:12PM
.jpg)
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గత ఆరేళ్ళ బట్టి ప్రత్యక్ష రాజకీయాలలోనే ఉంటునప్పటికీ, ఇప్పటికీ తప్పటడుగులు వేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గత 8 రోజులుగా సమ్మె చేస్తున్నఆర్టీసీ కార్మికులకు అండగా తమ పార్టీ నిలబడుతుందని, అరొక నాలుగయిదు రోజులలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్లను పరిష్కరించి వారిచేత సమ్మె విరమింపజేయలేకపోతే తమ పార్టీ వారికి సమ్మెకు మద్దతుగా రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే ఎంతసేపు ఏదో ఒక వర్గాన్ని తనవైపు త్రిప్పుకోవాలనే యావే గానీ దాని వెనుక ఉండే సమస్యల గురించి ఆయన ఆలోచించ(లే)రని ఆయన చేసిన ఈ హెచ్చరిక స్పష్టం చేస్తోంది. ఆర్టీసీ కార్మికుల సంఘాలు తక్షణమే సమ్మె విరమించాలని, లేకుంటే చట్టపరమయిన చర్యలు చేప్పట్టవలసి వస్తుందని మొన్న హైకోర్టు హెచ్చరించిన తరువాత జగన్మోహన్ రెడ్డి అనంతపురం బస్టాండ్ లో సమ్మె చేస్తున్న కార్మికులను కలిసి వారికి మద్దతు ప్రకటించిన తరువాత ప్రభుత్వానికి ఈ హెచ్చరిక చేసారు. అంటే హైకోర్టు ఆర్టీసీ కార్మికులను సమ్మె విరమించమని హెచ్చరిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి వారిని సమ్మె చేయమని ప్రోత్సహిస్తున్నట్లుంది.
హైకోర్టు ఆదేశాలను కాదని వారు తమ సమ్మె కొనసాగించినందుకు ఈరోజు కార్మిక సంఘాలకు కోర్టు ధిక్కారణ నేరం క్రింద షో కాజ్ నోటీసులు జారీ చేసింది. సమ్మె చేస్తున్న వారందరిపై ఎస్మా చట్టం ప్రయోగించమని ప్రభుత్వాలను ఆదేశించింది. సమ్మె వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నందున తాత్కాలిక ఉద్యోగులతో బస్సులను నడుపమని, వాటికి ఎవరయినా అడ్డుతగిలితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయమని హైకోర్టు ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలను ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తునప్పుడు తెలివయిన ఏ రాజకీయనాయకుడు కోర్టుతో చెలగాటం ఆడే ఆలోచన కూడా చేయడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా అనంతపురం జిల్లాలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకి తమ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించడం విశేషం. కోర్టు వద్దని చెపుతున్న సమ్మెకు ఆయన మద్దతు ప్రకటించడం చూస్తే ఇంకా ఎంతకాలం ఇలా తప్పటడుగులు వేస్తారో అనే అనుమానం కలుగుకమానదు.
తాజా సమాచారం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరుతున్నట్లుగానే 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు అంగీకరించింది. కనుక ఈరోజు నుండి వారు సమ్మె విరమించే అవకాశం ఉంది. తను చేసిన హెచ్చరికకు భయపడే ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం దిగి వచ్చిందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పుకొంటారేమో?