Latest News

తెలంగాణాకు తిరుగు ప్రయాణం అయ్యేందుకు వైకాపా సన్నాహాలు?

posted on: Sep 26, 2014 6:56PM

 

రాష్ట్ర విభజన జరగబోతోందని పసిగట్టగానే కొండా సునీతా రెడ్డి వంటి తెలంగాణా నేతలు ఎంతగా వారిస్తున్నా వినకుండా వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ రాత్రికి రాత్రే తెలంగాణాలో నుండి దూకి బయటపడి సమైక్యాంధ్ర పాటందుకొంది. కానీ ఆ తరువాత తన తొందరపాటుకు తాపీగా చింతించింది. దాని పని రెంటికీ చెడిన రేవడిగా మారింది. తెలంగాణాలో పార్టీ నేతలను గాలికొదిలి బయటపడటం వలన అక్కడ పార్టీ మూతపడింది. పోనీ సమైక్యరాగమాలపించి ఆంధ్రాలో ఓట్లు నొల్లుకొందామని ఆశపడితే ఆ ఆలోచనా బెడిసి కొట్టింది. విశ్వసనీయతకు పేటెంట్ హక్కులు తీసుకొన్నట్లు మాట్లాడే వైకాపాకు సరిగ్గా ఆ విశ్వసనీయత కోరవడం వలననే రెండు చోట్లా దెబ్బతింది.

 

చేతులు కాలేక ఇప్పుడు ఆకులు పట్టుకొన్నట్లు తెలంగాణాలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకొనేందుకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణాలో మిగిలిన కొద్దిపాటి నేతలతో ఆయన ఈరోజు హైదరాబాదులో సమావేశమయ్యి, తెలంగాణాలో మళ్ళీ గ్రామ స్థాయి నుండి పార్టీని ఏవిధంగా బలపరుచుకోవాలాని చర్చించారు. అందుకోసం వచ్చేనెల మొదటి వారంలో తెలంగాణాలో పార్టీ నేతలందరితో ఆయన సమావేశమవ్వాలని నిర్ణయించుకొన్నారు.

 

తెరాస, వైకాపాల మధ్య తెర వెనుక ఎటువంటి సంబంధాలున్నాయో తెలియదు కానీ ఇంతకాలం ఒకదాని ప్రసక్తి మరొకటి ఎత్తకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అయితే అందుకు ప్రధాన కారణం వైకాపా తెలంగాణాను వదిలిపెట్టడమేనని చెప్పవచ్చును. తమకు రాజకీయంగా ఇబ్బంది కలిగించనప్పుడు విమర్శించుకోవడం వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండదు కనుకనే అవి ఇంతకాలం ఒకదానికొకటి దూరంగా ఉన్నాయని చెప్పవచ్చును. కానీ ఇప్పుడు వైకాపా మళ్ళీ తెలంగాణాలో అడుగుపెట్టి పార్టీని బలోపేతం చేసుకొంటూ తమ ప్రభుత్వంపై విమర్శలు సంధించడం మొదలుపెట్టినట్లయితే, తెరాస కూడా నోరు విప్పక తప్పదు. అసలు తెలంగాణాలో తెరాస తప్ప వేరే ఏ రాజకీయ పార్టీ ఉండకూడదని గట్టిగా కోరుకొంటున్న తెరాసకు ఇప్పుడు వైకాపా కూడా మళ్ళీ వచ్చి చేరాలని చూస్తే తెరాస తప్పకుండా దాని ప్రయత్నాలను అడ్డుకొనే ప్రయత్నాలు చేయవచ్చును.

 

తెరాస అడ్డుకోకపోయినా తెలంగాణా ప్రజలే ఆ పార్టీని తిరస్కరించవచ్చును. ఎందువలన జగన్మోహన్ రెడ్డి సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేసుకోనేందుకే సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసినప్పటికీ అవి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేఖిస్తూ చేసినవిగానే తెలంగాణా ప్రజలు భావించడం సహజం. అందువలన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తెలంగాణా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొనేందుకు బయలుదేరినట్లయితే, ఆయనకు తెలంగాణా ప్రజలు మేళతాళాలతో ఎదురేగి పూలమాలలతో ఆహ్వానిస్తారని భావించలేము. కనుక ఇది కూడా మరొక తప్పుడు నిర్ణయమే అవుతుంది. ఈ నిర్ణయం వలన తెలంగాణాలో పార్టీ బలపడటం మాటెలా ఉన్నా, తెరాస కూడా శత్రువుగా మారడం తధ్యం.

google-ad-img
    Related Sigment News
    • Loading...