దసరా తర్వాత జగన్ పార్టీ సగం ఖాళీ అవుతుందా?
posted on Sep 24, 2015 7:02PM

మేం గేట్లు తెరిస్తే వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుంది, జగన్ ఎమ్మెల్యేల్లో సగమంది తెలుగుదేశంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు, వచ్చే ఎన్నికల నాటికి పిల్ల కాంగ్రెస్ ఉండనే ఉండదు...ఈ డైలాగులన్నీ అధికార పార్టీ నేతలు ఎప్పట్నుంచో చెబుతున్నా, ఆ స్థాయిలో వలసలు మాత్రం జరగలేదు, అయితే రాజధాని భూమిపూజ తర్వాత పెద్దఎత్తున వైసీపీ నుంచి వలసలు ఉంటాయని కొందరు టీడీపీ నేతలు బలంగా చెబుతున్నారు, ఇందులో ఎంత నిజముందో తెలియదు గానీ నలుగురైదురు ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్యనేతలు మాత్రం టీడీపీలో చేరేందుకు రంగంసిద్దం చేసుకుంటున్నారని తెలుస్తోంది.
ముఖ్యంగా జగన్ సొంత జిల్లా కడప నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి... తెలుగుదేశంలో చేరడం ఖాయమని వినిపిస్తోంది, పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా ఉంటున్న ఆదినారాయణరెడ్డి...ఇప్పటికే టీడీపీ నేతలతో మంతనాలు జరిపారని, గ్రీన్ సిగ్నల్ రాగానే జంపైపోవడం ఖాయమని అంటున్నారు, కడప జిల్లాలో పదింటికి తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు గెలిచిన వైసీపీకి ఆదినారాయణ జంప్ తో తొలి షాక్ తగలనుంది, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఆదినారాయణరెడ్డి... జగన్ రెడ్డికి హ్యాండిచ్చారు, అప్పటివరకూ జగన్ వైపే ఉంటానని చెప్పి, తీరా అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టేసరికి కిరణ్ కి ఓటేశారు. ఇప్పుడు మరలా మరోసారి హ్యాండిచ్చేందుకు రెడీ అవుతున్నారు
కృష్ణాజిల్లా వైసీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ కూడా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి, టీడీపీలో చేరడానికి ఆ పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, మంచి ముహూర్తం చూసుకుని పసుపు కండువా కప్పుకోవడమేనంటున్నారు. గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వేదవ్యాస్...చిరంజీవి రాజకీయాల్లోకి రావడంతో పీఆర్పీలో చేరారు, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడంతో తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు. అయితే 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన వేదవ్యాస్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు, దాంతో మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే బూరగడ్డవి కుప్పిగంతులంటున్నారు కొందరు
వీరిద్దరూ కాకుండా అరకలోయ ఎమ్మెల్యే కిడారి, ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు, కృష్ణాజిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో అరకలోయ ఎమ్మెల్యే కిడారి టీడీపీలో చేరడం ఖాయమని, ఆల్రెడీకి అతనికి పదవి కూడా ఖరారైందని చెప్పుకుంటున్నారు, అయితే ఎంతమంది జంప్ అవుతారో కచ్చితంగా తెలియాలంటే దసరా వరకూ ఆగాల్సిందే