ఇప్పుడు నొప్పిగా వుందా జగన్ బాబూ?
posted on: Jul 7, 2014 12:35PM
.jpg)
వైసీపీ నాయకుడు జగన్‌కి, ఆయన అనుయాయులకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కంటే ఏదో ఒక హడావిడి చేస్తూ వార్తల్లో నిలిచే అంశమే ప్రధానంగా వున్నట్టు కనిపిస్తోంది. గత నాలుగైదు రోజులుగా వైసీపీ నాయకులు కొత్త పాయింట్ పట్టుకుని ఊరేగుతున్నారు. అది మునిసిపల్ స్థానాలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకులను ప్రలోభ పెట్టిందని, వారిని తనవైపు లాక్కుందని వారు తాజాగా లేవనెత్తిన పాయింట్. ఈ విషయం మీద వైసీపీ నాయకుడు జగన్ గవర్నర్ని కూడా కలసి మొత్తుకున్నారు. పాపం జగన్ బ్యాచ్ లోపాలన్నీ తమవైపు పెట్టుకుని తెలుగుదేశాన్ని ఆడిపోసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులలో జగన్ నాయకత్వం మీద అసంతృప్తి బాగా పెరిగిపోయింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జగన్ పార్టీలోనే ఆయన మీద వ్యతిరేకత పీక్‌కి చేరుకుంది. ఈ నేపథ్యంలో అనేకమంది పార్టీ మారుతున్నారు. అలాగే స్థానిక ఎన్నికల అధ్యక్ష పీఠాల ఎన్నికలు జరిగిన సందర్భంలో కూడా చాలామంది వైసీపీకి స్వచ్ఛందంగా గుడ్ బై కొట్టి తెలుగుదేశం పార్టీలో చేరారు. అనేక స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకోవడానికి కారణమయ్యారు. జగన్ మీద వున్న వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ అధికారంలో వుండటం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో కృషి చేస్తూ వుండటం వల్ల వైసీపీ నాయకులు అనేకమంది తెలుగుదేశం వైపు ఆకర్షితులయ్యారు. వైసీపీ నాయకులు ఎన్ని బెదిరింపులు చేసినా చాలామంది తెలుగుదేశం వైపు వచ్చేశారు. తమ పార్టీ నాయకులు తనకు గుడ్ బై కొట్టడం వెనుక వున్న అసలు విషయాలను జగన్ పరిగణనలోకి తీసుకోకుండా ఆయన తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకోవడంలో బిజీగా వున్నారు. పాపం జగన్ బాబుకి తన పార్టీ నుంచి చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయినట్టుంది. అందుకే ఫ్లాష్‌బ్యాక్‌ని మరచిపోయి మాట్లాడుతున్నారు. గతంలో అనేకమంది తెలుగుదేశం నాయకుల మీద, శాసనసభ్యుల మీద ఆకర్ష మంత్రాన్ని ప్రయోగించి, వారిని వైసీపీలోకి లాక్కుని తెలుగుదేశం పార్టీని ఏకాకిని చేయడానికి తీవ్రంగా ప్రయత్నించిన విషయాన్ని ఆయన మరచిపోయినట్టున్నారు. అప్పుడు తాను చేసింది న్యాయం.. ఇప్పుడు జరిగింది అన్యాయం అన్నట్టు మాట్లాడుతున్న జగన్‌ని ఏమనాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలుగుదేశం నాయకులను తన పార్టీలోకి లాక్కున్నప్పుడు ఎగిరి గంతులేసిన జగన్‌కి ఇప్పుడు తన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరుతూ వుండేసరికి ఆ నొప్పేమిటో తెలిసొచ్చిందని చెబుతున్నారు.






.webp)



