రాష్ట్రపతి ఎన్నికలు.. జగన్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి...!

 

త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేతలు ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు. ఏ పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది.. ఏ పార్టీ వ్యతిరేకత చూపుతుంది..? ఎవరు ఎవర్ని బరిలోకి దింపుతారు..? ఎవరికి రాష్ట్రపతి పదవి దక్కుతుంది..? ఇలా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాము సూచించిన అభ్య‌ర్థే బ‌రిలో నిల‌వాలని బీజేపీ ఆధ్వ‌ర్యంలో ఎన్డీఏ కూట‌మి గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మోడీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా.. ప్రాంతీయ పార్టీల‌తో క‌లుపుకుని అభ్య‌ర్థిని బ‌రిలో దించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్రస్తుతం బీజేపీ మంచి ఫాంలో ఉన్నా... కానీ మోడీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ కలిసి ఎన్నికకు గట్టి పోటీనే ఇవ్వచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

ఇప్పటికే శివసనే, అకాలీదళ్ నేతలు వారి తరపు నేతలను రాష్ట్రపతిగా ఎంపకి చేయాలని పలు పేర్లను తెరపైకి తీసుకొస్తున్నారు. దీంతో వారు బీజేపీకి మద్దతివ్వరన్న విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. మోడీ అంటేనే క‌య్యానికి కాలుదువ్వే తృణ‌మూల్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఒడిషా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, బీహార్ సీఎం నితీష్ కుమార్, డీఎంకే అధినేత స్టాలిన్‌ల‌ు కాంగ్రెస్ పార్టీకే మద్దతివచ్చు. ఒక వేళ అన్ని ప్రాంతీయ పార్టీలు ఏక‌మైతే రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోసం జ‌రిగే ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థి గెలుపు అంత సులువైన విష‌యం కాదంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. బీజేపీ అభ్యర్ధిగా ఎల్ కె. అద్వానీ అయోధ్య దెబ్బకి ఔట్. ఇక వెంకయ్యనాయుడు ఎంత రాయించుకున్నా ఆయన పేరు ఎప్పుడూ పరిశీలనలో లేరు. దీంతో ఈ ఎన్నికలతో రాష్ట్రపతి బీజేపీ అభ్యర్ధి విజయం నల్లేరు మీద బండిలా ఉండకపోవచ్చు అంటున్నారు.

 

ఇదిలా ఉండగా... బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి గెలుపునకు సౌత్ ఇండియా కీలకం కానుంది. కేరళలో లెఫ్ట్, కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. తమిళనాడు విషయానికి వస్తే స్టాలిన్ కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇక తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అయితే బీజేపీకి సరెండర్ అయిపోనట్టే. ఇక తెలంగాణలో పరిస్థితి చూస్తే కేసీఆర్ సర్కార్ ఇటీవల దిగ్విజయ్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉండటతో బీజేపీకే మద్దతు పలికే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సూచించిన అభ్య‌ర్థికి ఎన్డీఏ కూట‌మిలోని అన్ని పార్టీలు ఓటు వేసినా రాష్ట్ర‌ప‌తి పీఠం ద‌క్కించుకునేందుకు ఇంకా 25వేల ఓట్లు అవ‌స‌ర‌మ‌వుతాయి. టీఆర్ఎస్‌కు 22వేల ఓట్లు ఉన్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ నేత జితేందర్ రెడ్డి ముందు మద్దతు తెలిపి... ఆ తరువాత మళ్లీ ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు అని చెప్పడం ఆశ్చర్యకరమే. అయితే ఈ ఓట్లు బీజేపీకి కీలకంగా మారాయి. ఏపీలో టీడీపీ ఎలాగూ బీజేపీకి మిత్రపక్షం కాబట్టి మద్దతు ఇస్తుంది.

 

ఇకపోతే ఈ రాష్ట్రపతి ఎన్నికల వలన ఎవరి లాభం.. ఎవరికి నష్టమో తెలియదు కానీ...ఏపీ ప్రతిపక్ష పార్టీ నేత అయిన జగన్ కు మాత్రం ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారయ్యాయని మాత్రం తెలుస్తోంది. అటు సపోర్ట్ చేసినా ప్రాబ్లం.. చేయకపోయనా ప్రాబ్లం లాగా మారింది పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ జగన్ కనుక బీజేపీకి వ్యతిరేకత చూపించినట్టయితే ఆయనను నీడలా వెంటాడుతున్న అక్రమాస్తుల కేసు వెంటనే తెరపైకి వస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. పోనీ బీజేపీకి మద్దతిచ్చారా.. తాను ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కును కోల్పోయినట్టవుతుంది. కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రప్రభుత్వం రెండూ కుమ్మక్కయి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేస్తున్నాయి అని ఏకంగా నిరాహార దీక్షలే చేశారు. దాంతో ఇకపై ఎప్పుడైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే.. అలాంటప్పడు బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చారు అని రివర్స్ లో ఆయనకే ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. మరి ఇప్పటివరకూ రాష్ట్రపతి ఎన్నికలపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వని జగన్.. ఏం చేస్తారో..బీజేపీకి మద్దతిస్తారో..? లేక వార్ కు రెడీ అవుతారో...? చూద్దాం...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu