కేరళ నర్సు నిమిషప్రియ ఉరి రద్దు చేసిన యెమెన్
posted on Jul 29, 2025 9:15AM
.webp)
కేరళ నర్సు నిమిషప్రియ మరణ శిక్షను యెమెన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు యెమెన్ ప్రభుత్వం సోమవారం (జులై 28) అర్ధరాత్రి దాటిన తరువాత భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ లీడర్ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. యెమెన్‌లోని సూఫీ మత పెద్ద షేక్ హబీబ్ ఓమర్ బిన్ హఫీజ్ నేతృత్వంలో బృందాన్ని నిమిషప్రియ ఉరి రద్దు చర్చల కోసం నియమించిన సంగతి విదితమే.
అబుబాకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వంతోపాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు. చర్చలు ఫలించడంతో ఆమె ఉరిశిక్ష రద్దుకు యెమెన్ ప్రభుత్వం అంగీకరించింది. అబుబాకర్ ప్రకటనను యెమెన్‌లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీస్ జస్టిస్ ప్రతినిధి సర్హాన్ షంశాన్ అల్ విశ్వాబి ధ్రువీకరించారు. మత పెద్దల చొరవతోనే నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దైందన్నారు.
నిమిష ప్రియ జైలు నుంచి విడుదలవుతారా, లేక జీవిత ఖైదుగా శిక్షను మార్పు చేస్తారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మరణించిన తలాల్ అబ్దో మహదీ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరం తదుపరి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. హత్య కేసులో నిమిష ప్రియకు యెమెన్ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే.
ఇలా ఉండగా కేరళ నర్సు నిమిష ప్రియ ఉరి రద్దు అయినట్లుగా వస్తున్న వార్తలను భారత విదేశాంగ శాఖ వర్గాలు ఖండించాయి. ఇప్పటి వరకు ఉరిశిక్ష రద్దుకు సంబంధించి యెమెన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదనీ స్పష్టం చేశాయి.