‘ఎర్ర’ ముద్ర పోయేదెలా?
posted on May 7, 2015 11:59PM

వైసీపీ మీద ఇప్పుడు ఎర్రటి ముద్ర పడింది. ఆ ముద్రను ఎలా వదిలించుకోవాలా అని ఆ పార్టీ ఇప్పుడు తంటాలు పడుతోంది. ఈ తాజా గండం నుంచి తప్పించుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అయితే ఎంత ప్రయత్నించినా ఆ ‘ఎర్ర’ ముద్ర చెరిగిపోవడం లేదు... కాలం గడిచేకొద్దీ ఆ ముద్ర సైజు పెరిగిపోతూ వస్తోంది. ఇంతకీ ఆ ‘ఎర్ర’ ముద్ర ఏమిటంటే ఎర్రచందనం ముద్ర. ఎర్ర చందనం స్మగ్లర్ల కారణంగా వైసీపీ మీద పడిన ముద్ర. అంతర్జాతీయ స్థాయి ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డికి, వైసీపీకి వున్న అనుబంధం చాలా దృఢమైనదన్నదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంటర్‌పోల్ చేతికి చిక్కిన ఈ స్మగ్లర్‌ని ఏపీకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గంగిరెడ్డి ఏపీ పోలీసులకు చిక్కి, ‘సత్కారం’ లభిస్తే ఎవరి పేర్లు వెల్లడి అవుతాయో అన్న ఆందోళన సదరు పార్టీ వారికి వున్నాయి. అలాగే మొన్నీమధ్య దొరికిపోయిన స్మగ్లర్ మస్తాన్ వలీ కూడా వైసీపీ ముద్దుబిడ్డే. మస్తాన్ వలీ మూడో భార్య, హీరోయిన్ అయిన నీతూ అగర్వాల్ మీద పోలీసుల దృష్టి పడిన తర్వాత ఆమె పోలీసులకు లొంగిపోవాలని అనుకుంది. ఆ విషయాన్ని కొంతమంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసింది. వాళ్ళు లొంగిపోతే మంచిది కాదని ఆమెకు సలహా కూడా ఇచ్చారు. సదరు ఎమ్మెల్యేలు కూడా ఘనత వహించిన వైసీపీ ఎమ్మెల్యేలే అని సమాచారం అందుతోంది. ఇన్ని రకాలుగా ఎటు తిప్పినా ఎర్రచందనం స్మగ్లర్ల ఇష్యూ వైసీపీకి చుట్టుకుంటూ వుండటం ఆ పార్టీ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది.