తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. ఔనని వైవీ.. కాదని జగన్!
posted on: Feb 7, 2026 11:38AM

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం విషయంలో వైసీపీలోనే వ్యక్తమౌతున్న భిన్న అభిప్రాయాలు ఆ పార్టీ అబద్ధాల రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీవి ఫేకు రాజకీయాలనడానికి కల్తీ నెయ్యి విషయంలో జగన్ చెబుతున్న మాటలకూ, ఆయన బాబాయ్ వరస అయ్యే వైవీ సుబ్బారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకూ పొంతన లేకపోవడమే నిదర్శనమని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు.
ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఉమ వైసీపీ అధినేత సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని అంగీకరించారనీ, అయితే జగన్ మాత్రం కల్తీ జరగడం లేదని చెబుతున్నారనీ ఎత్తి చూపారు. వీరి మాటల్లో ఉన్న వ్యత్యాసం గమనిస్తే వైసీపీలో అంతర్గత విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని అవగతమౌతోందన్నారు. అంతే కాకుండా వైసీపీ అబద్ధాల పునాదులపై రాజకీయం చేస్తున్నదనడానికి వైవీ, జగన్ మాటల మధ్య పొంతన లేకపోవడం తార్కానమని విమర్శించారు.
తిరుమల లడ్డూ వ్యవహారంలో చేసిన మహాపాపాలు వైసీపీ నేతలను వెంటాడుతున్నాయని, తప్పులపై తప్పులు చేస్తున్నారనీ అన్నారు. వైసీపీకి ఏకైక ఎజెండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను తిట్టడమేన ఉమ దుయ్యబట్టారు. రాంబాబు ఇంటివద్ద, జోగి రమేష్ ఇంటివద్ద కూడా జగన్ అవే అబద్ధాలు, అసత్యాల ప్రచారం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇటువంటి విషయాలపై సుమోటోగా సుమోటోగా కేసులు నమోదు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దేవినేని ఉమ కోరారు.






