చెవుల్లో పూలు పెడుతున్న చెవిరెడ్డి

posted on: Sep 26, 2014 3:50PM

 

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనదైన శైలిలో గట్టిగా మాట్లాడుతూ, తన మాటలని వినేవాళ్ళ చెవుల్లో పూలు పెట్టడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అర్హులైన పేదవారికే ప్రభుత్వ పథకాలను అందేలా చేయాలని కృషి చేస్తోంది. అనర్హులకు, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో వున్న వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయడం ఎంతమాత్రం న్యాయం కాదు. దీన్ని ఎవరూ సమర్థించరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమంగా తెల్ల రేషన్ కార్డులు కలిగి వున్నవారిని గుర్తించి, అటువంటి వారికి పథకాలు వర్తింపజేయకుండా వుండాలని, బోగస్ తెల్ల రేషన్ కార్డులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ కృషిలో భాగంగా దాదాపు 67 లక్షల బోగస్ రేషన్ కార్డులు బయటపడ్డాయి. వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్న అనేకమంది అనర్హుల గుట్టు రట్టయింది. వీరిలో వైసీపీ ఎమ్మెల్యే తండ్రి చెవిరెడ్డి భాస్కరరెడ్డి తండ్రి కూడా వున్నారు. కోటీశ్వరుడైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి తండ్రికి తెల్ల రేషన్ కార్డు వుండటంతోపాటు ఆయన నెలనెలా వృద్ధాప్య పెన్షన్ కూడా తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి పరకాల ప్రభాకర్ బయటపెట్టారు. ఈ వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంతోమందిని నోటి మీద వేలు వేసుకునేలా చేశాయి. బోగస్ రేషన్ కార్డుల ఏరివేత మీద రాద్ధాంతం చేద్దామని అనుకున్న వైసీపీ గొంతులో చెవిరెడ్డి తండ్రి ఉదంతం వెలక్కాయలా మారింది.

 

ఇదిలా వుంటే మొగుణ్ణి కొట్టినమ్మ మొగసాలకి ఎక్కిందన్నట్టుగా ఇంత జరిగినా పశ్చాత్తాపపడకుండా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మీడియా ముందుకు వచ్చి తనదైన శైలిలో ఘాటుగా మాట్లాడారు. తన తండ్రికి వైట్ రేషన్ కార్డు వుండటం, నెలనెలా పెన్షన్ అందడం తెలుగుదేశం పార్టీ కుట్ర అని ఆరోపించారు. ఎక్కడైనా ఇరుక్కుపోయిన రాజకీయ నాయకుడు సాధారణంగా వాడే ‘‘బహిరంగ చర్చకు వస్తావా’’ అనే సవాల్‌ని పరకాలకు ప్రభాకర్‌కి విసిరారు. గత పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చే అధికారం తెలుగుదేశం పార్టీకి లేదు. అలాంటప్పుడు ఆయన తండ్రికి తెల్ల రేషన్ కార్డు, వృద్ధాప్య పెన్షన్ రావడం తెలుగుదేశం కుట్ర ఎలా అవుతుందో ఘనత వహించిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి గారే చెప్పాలి. సరే, కాసేపు తెలుగుదేశం పార్టీ కుట్ర చేసి చెవిరెడ్డి తండ్రికి తెల్ల రేషన్ కార్డు, వృద్ధాప్య పెన్షన్ ఇచ్చిందే అనుకుందాం. అలా ఇచ్చేస్తే చెవిరెడ్డి తండ్రి వాటిని ఎందుకు తీసుకున్నట్టు? నెలనెలా రేషన్, వృద్ధాప్య పెన్షన్ ఎందుకు తీసుకుంటున్నట్టు? చెవిరెడ్డి తన వాగ్ధాటితో జనం చెవుల్లో పూలు పెట్టేముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాలని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. పేదలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందాలని చిత్తశుద్ధితో కృషి చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఇకనైనా సహకరిస్తే బాగుంటుందని సూచిస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...