వికేంద్రీకరణ బిల్లుపై సెలక్ట్ కమిటీ ఏర్పాటు కాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ!!

పాలన వికేంద్రీకరణ బిల్లులపై సెలక్ట్ కమిటీ ఏర్పాటు కాకుండా జగన్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. కమిటీలు వేయొద్దని కార్యదర్శిపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుందని సమాచారం. చైర్మన్ నిర్ణయం పాటించొద్దు అంటూ ఉప ముఖ్యమంత్రి, చీఫ్ విప్ లు లేఖలు రాశారు. దీంతో కార్యదర్శి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. పాలన వికేంద్రీకరణ, సీ ఆర్ డీ ఏ రద్దు బిల్లులపై శాసనమండలిలో సెలెక్ట్ కమిటీని ఏర్పాటు కాకుండా జగన్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కమిటీల ఏర్పాటు జరగకుండా చూడాలని ప్రభుత్వ, వేసి తీరాల్సిందేనని చైర్మన్ గట్టి పట్టుదలతో ఉండటంతో ఉత్కంఠ భరితంగా మారింది. సెలక్ట్ కమిటీల ఏర్పాటును అడ్డుకునే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండలి కార్యదర్శికి ఏకంగా లేఖ రాయగా కమిటీల్లో నియమించేందుకు తమ సభ్యుల పేర్లను టిడిఎల్పీ ఇప్పటికే ఇన్ చార్జి కార్యదర్శి రాజ్ కుమార్ కు అందజేసింది. దీంతో ఆయన ఇరకాటంలో పడ్డారు.

రాజధాని బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంపై ఆగ్రహించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏకంగా మండలిని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపారు. అయితే కేంద్రం తుది నిర్ణయం తీసుకుని పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించి రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసేదాకా మండలి కొనసాగుతుంది. ఈలోపు సెలక్ట్ కమిటీలు ఏర్పాటు కాకుండా మండలి ఇన్ చార్జి కార్యదర్శిపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సెలక్ట్ కమిటీల్లో నియమించే ఎమ్మెల్సీల పేర్లు పంపాల్సిందిగా ఆయా పార్టీలకు లేఖలు రాయాలని మండల ఇన్ చార్జి కార్యదర్శికి ఇప్పటికే చైర్మన్ లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితుల్లో చైర్మన్ ఆదేశాల ప్రకారం ఆయన వెంటనే లేఖలు రాస్తారు కానీ, ప్రభుత్వ ఒత్తిడి బలంగా ఉండటంతో ఆయన ఇంత వరకూ ఈ లేఖలు పంపలేదు. ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే యోచనతో టిడిపి శాసన సభాపక్షం తమ తరపున పదిమంది ఎమ్మెల్సీల పేర్ల జాబితాను ఇప్పటికే కార్యదర్శికి అందజేసింది. ఒక్కో కమిటీలో టిడిపి కోటా కింద ఐదుగురు సభ్యులు వస్తారు. ఇది అందజేసినట్టు కార్యదర్శి నుంచి రశీదు కూడా తీసుకున్నారు. ఇది తెలిసి అధికార పక్షం వెంటనే రంగంలోకి దిగింది.

మండలిలో సభా నాయకుడిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్, ప్రభుత్వ చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్ లు విడివిడిగా కార్యదర్శికి లేఖలు రాశారు. నియమాలకు విరుద్ధంగా సెలక్ట్ కమిటీల ఏర్పాటు జరుగుతున్నందున అందులో తాము భాగస్వామి కాబోమని తమ పార్టీ నుంచి ఎవరూ ఈ కమిటీల్లో ఉండరని ఉమారెడ్డి తన లేఖలో తెలిపినట్టు ప్రచారం జరుగుతుంది. కమిటీలు ఏర్పాటు చేయాలని చైర్మన్ తీసుకున్న నిర్ణయం.. నియమాలకు విరుద్ధమని అందువల్ల కమిటీలు ఏర్పాటు చేయవద్దని కోరుతూ బోస్ మరో లేఖ రాశారు.

ప్రభుత్వ అధికారి అయిన కార్యదర్శి అటు ప్రభుత్వపక్షం మాట కాదనలేక, ఇటు చేరిపోయిన ఆదేశాలను ధిక్కరించే పరిస్థితి లేక ఏ నిర్ణయం తీసుకోకుండా రోజులు నెట్టుకొస్తున్నారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మండలిలో సభా నాయకుడి లేఖను జతపరుస్తూ.. పై అభ్యంతరాల దృష్ట్యా తాను సెలెక్ట్ కమిటీ ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేనని చైర్మన్ కు లేఖ రాయాల్సిందిగా కార్యదర్శికి ప్రభుత్వం సూచించిందని అంటున్నారు. మరి ఆయన అలా రాస్తారా లేదా అన్నది చూడాలి.