యాకుబ్ ఉరిశిక్షపై సుప్రీం భిన్నాభిప్రాయం!!!
posted on Jul 28, 2015 8:22PM
.jpg)
ముంబై బాంబు ప్రేలుళ్ళలో 250 మంది మరణానికి, 600 మంది గాయపడటానికి కారకుడయిన యాకుబ్ మీమన్ కి ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష వేయగా దానిని సుప్రీంకోర్టు స్వయంగా ఖరారు చేసింది. ఆ తరువాత యాకుబ్ మీమన్ పెట్టుకొన్న క్షమాభిక్ష పిటిషన్ని రాష్ట్రపతి కూడా తిరస్కరించిన తరువాతనే అతనికి ఈనెల 30న ఉరిశిక్ష అమలుచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. కానీ తను ఖరారు చేసిన శిక్షపై ఇప్పుడు సుప్రీంకోర్టే స్వయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో, యాకుబ్ మీమన్ కి మరణశిక్ష విధించడం అన్యాయమనే వాదనలకు బలం చేకూర్చుతున్నట్లయింది.
యాకుబ్ మీమన్ భార్య పెట్టుకొన్న పిటిషన్ని విచారించిన జస్టీస్ దావే, జస్టిస్ కురియన్ లతో కూడిన ధర్మాసనం యాకుబ్ మీమన్ ఉరిశిక్ష అమలుపై ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఈ కేసును మరొక త్రిసభ్య బెంచీకి బదలాయించింది. కోర్టులు మానవతా దృక్పదంతో వ్యవహరించడం అవసరమే! కానీ వందలమంది ప్రాణాలను బలిగొన్న వారిపట్ల కూడా మానవతా దృక్పదం కనబరుస్తుంటే అది అటువంటి నేరస్తులకు, వారిని సమర్ధించేవారికి చాలా అలుసుగా కనబడుతోంది.
యాకుబ్ మీమన్ ప్రాణాల గురించి అంతగా ఆందోళన చెందుతున్న వారెవరూ కూడా నిన్న పంజాబ్ లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన తొమ్మిదిమంది పోలీసులు, ప్రజల గురించి ఒక్క ముక్క సానుభూతిగా మాట్లాడలేకపోయారు. కనీసం ఉగ్రవాదుల దాడిని కూడా ఖండించాలనుకోలేదు. భద్రతా దళాల చేతిలో నిన్న చనిపోయిన ఉగ్రవాదులు పఠాన్ కోట్-అమ్రిత్ సర్ రైల్వే ట్రాకుపై ఐదు బాంబులను అమర్చారు. ఒకవేళపోలీసులు సకాలంలో వాటిని కనుగొనలేక పోయుంటే ఏమయ్యేదో ఊహించుకొంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. అటువంటి ఉగ్రవాదుల పట్ల కూడా మన న్యాయస్థానాలు మానవతా దృక్పధంతో తీర్పులు పునః సమీక్షించుకోవలసి ఉందా? అనే అంశంపై లోతుగా చర్చ జరగవలసి ఉంది.