వాహ్.. క్యా సీన్ హై!

posted on: Jul 2, 2026 11:01AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే తీవ్రమైన విమర్శలు, ప్రతి విమర్శలు,  సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉంటాయి. మరీ ముఖ్యంగా వైసీపీ, తెలుగుదేశం నేతలు ఒకరిపై ఒకరు ఉప్పు నిప్పులా విమర్శలతో విరుచుకు పడుతుంటారు. అయితే గతంలో అంటే వైఎస్, చంద్రబాబులల హయాంలో ఈ పరిస్థితి ఉండేది కాదు..   రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ, వ్యక్తిగత సంబంధాలు గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా  ఉండేవి.

అయితే తరువాత  రాజకీయాల్లో వ్యక్తిగత శత్రుత్వాలు పెరిగిపోయాయి. ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. మామూలుగా ఎవరైనా వారిద్దరూ ఎదురుపడితే.. ఎడముఖం, పెడముఖంగా ఉంటారని భావిస్తారు. కానీ రఘురామకష్ణం రాజు, అంబటి రాంబాబులు పరస్పరం పలకరించుకున్న తీరు వాహ్ క్యాసీన్ హై అన్నట్లుగా ఉంది. 

వివరాల్లోకి వెడితే.. వైసీపీ ఫైర్‌బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు,  తెలుగుదేశం  సీనియర్ నేత, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు  ఇరువురూ హైదరాబాద్‌లో నిన్న జరిగిన ప్రముఖ సినీ దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు  హాజరయ్యారు. ఆ సందర్భంగా ఒకరికొకరు ఎదురు పడ్డారు.  రాజకీయంగా ఒకరైపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకునే ఈ ఇరువురూ.. ఒకరికొకరు ఎదురుపడిన సందర్భంగా పరిస్థితి ఎలా మారుతుందా అని అక్కడున్న వారంతా ఒక్క క్షణం కంగారు పడ్డారు.  

అయితే  అంబటి రాంబాబు, రఘురామ కృష్ణంరాజు ముఖాముఖి ఎదురైన వెంటనే ఒకరినొకరు  ఆప్యాయంగా పలకరించుకున్నారు. పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు.   ఆ సమయంలో రఘురామ కృష్ణంరాజు అంబటితో ఏదో అన్నారు. ఆ మాటకు అంబటి పగలబడి నవ్వుతూ రఘురామకృష్ణం రాజును హత్తుకున్నారు.  రాజకీయాల్లో  ఎంతగా విభేదాలు ఉన్నా.. వ్యక్తిగత సంబంధాల విషయంలో ఆ వైరుద్ధాలు ఉండకూడదని వీరిరువురూ తమ తీరుతో చాటారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.   ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం అవసరమని నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...