ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం.. ఈ జబ్బు గురించి ఎంత మందికి తెలుసు?

posted on: Apr 17, 2026 2:52PM

 

మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హిమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు ఒకటుందని కూడా తెలియదు. హీమోఫిలియా అనేది శరీరం రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ఒక ఆరోగ్య పరిస్థితి. శరీరంలో రక్తం గడ్డకట్టే కారకాలు లోపించడం వల్ల, చిన్న గాయాలు కూడా ఎక్కువసేపు రక్తస్రావానికి కారణమవుతాయి. ఇది తరచుగా కుటుంబాలలో వంశపారంపర్యంగా వచ్చే ఒక జన్యుపరమైన వ్యాధి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన ప్రపంచ  హీమోఫిలియా  దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ఈ జబ్బు గురించి,  ఈ జబ్బు లక్షణాల గురించి,  ఈ జబ్బుకు గల కారణాల గురించి వివరంగా తెలుసుకుంటే..

హీమోఫిలియా లక్షణాలు..

గాయం తర్వాత ఎక్కువసేపు రక్తస్రావం కావడం,  కీళ్లలో వాపు , నొప్పి, ఎటువంటి కారణం లేకుండా ముక్కు నుండి రక్తస్రావం కావడం, చిన్న గాయాలు కూడా మానడంలో ఆలస్యం కావడం, శరీరంపై నీలి గుర్తులు ఏర్పడటం హీమోఫిలియా వ్యాధి లక్షణాలు.

ఏప్రిల్ 17 వ తేదీన ఎందుకు జరుపుకుంటారు?

ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని 1989లో ప్రపంచ హిమోఫిలియా సమాఖ్య (World Federation for Hemophilia) మొదటిసారిగా స్థాపించింది. WFH వ్యవస్థాపకుడైన ఫ్రాంక్ ష్నాబెల్ పుట్టినరోజుతో ఏకీభవించేలా ఈ రోజును ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపై అవగాహన పెంచడం,  రోగులకు మెరుగైన చికిత్స అందించడం దీని ఉద్దేశ్యం.

థీమ్ ఇదే..

వ్యాధి నిర్థారణే.. సంరక్షణకు మొదటి మెట్టు అనేది ఈ ఏడాది ప్రపంచ హీమోఫిలియా వ్యాధి దినోత్సవానికి థీమ్ గా ఎంపిక చేశారు. ఈ వ్యాధికి చికిత్స,  సంరక్షణ మొదలైనవి.. కేవలం వ్యాధి నిర్థారించడంతోనే సాధ్యమవుతుందని, చికిత్సను సులువు చేస్తుందని దీని అర్థం.

హీమోఫిలియా..

శరీరంలో ఏ చిన్న గాయం అయినా.. రక్తం గడ్డకట్టడం ద్వారా రక్తస్రావం ఎక్కువ జరగకుండా ఉండటానికి శరీరంలో కొన్ని కారకాలు ఉంటాయి. ఇవి లోపిస్తే.. హీమోఫిలియా వ్యాధి వస్తుంది.  రక్తస్రావం ఆగకుండా ఉండటం వల్ల శరీరంలో రక్తం కోల్పోయి అతి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీస్తుంది. ఈ సమస్యను ఎంత తొందరగా గుర్తించి,  నిర్థారించగలిగితే.. మనిషి ప్రాణాన్ని అంత తొందరగా సంరక్షించుకునే అవకాశాలు ఎక్కుువగా ఉంటాయి.

ఈ వ్యాధి మీద అవగాహన పెంచడానికి,  ప్రజలను అప్రమత్తం చేయడానికి,  లక్షణాలను గమనించేలా ప్రజలను సన్నద్ధం చేయడానికి ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం,  జబ్బు పట్ల ప్రజలలో అపోహలు తొలగించడం,  ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వంటివి ఈ ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తారు.

                                 *రూపశ్రీ.

google-ad-img
    Related Sigment News
    • Loading...