Latest News
శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం 500 కిలోమీటర్ల కర్రల నడక.. సాహస భక్తియాత్ర
posted on: Mar 10, 2026 11:43AM
.webp)
అచంచల భక్తితో ఎంతటి కష్టాన్నైనా అధిగమించవచ్చని పెద్దలు చెబుతుంటారు. అయితే ఆ భక్తితోనే అంతులేని శ్రమకు ఓరుస్తున్నారు కర్నాటకు చెందిన ఇద్దరు భక్తులు. శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వారు చేస్తున్న పాదయాత్ర.. అమ్మబాబోయ్.. ఇంత కష్టం ఎలా భరిస్తున్నార్రా బాబోయ్ అనిపించేలా ఉంది. ఔను నిజంగా ఆ భక్తులు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం ఎంచుకున్న మార్గం పాదయాత్ర. అది కూడా రాజకీయనాయకులు చెబుతున్నట్లుగా కేవలం పాదాలమీద యాత్ర కాదు.. కాళ్లకు కర్రలు కట్టుకుని మరీ ఐదు వందల కిలోమీటర్ల మేర నడిచి మరీ మల్లన్నస్వామి దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అసలు రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర అంటేనే కష్టం.. అలాంటిది కాళ్లకు కర్రలు కట్టుకుని నడవడమంటే.. అమ్మో అసాధ్యం అనిపిస్తుంది ఎవరికైనా. అయితే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తామంటున్నారు కర్నాటక బాగల్ కోట జిల్లా వాసులు బసవప్రియ, రమేష్ లు. ఇది తమ మొక్కు అని చెబుతున్నారు. మొక్కు తీర్చుకోవడానికే ఈ సాహసోపేత భక్తి యాత్ర చేపట్టామంటున్నారు.
బాగల్ కోట జిల్లా హనుగుంద తాలూకాకు చెందిన బసవ ప్రియ తన భక్తియాత్రను ఈ నెల 4న మొదలెట్టారు. కాలినడకన మల్లన్నను దర్శించుకుని 151 కిలోల పంచలోహ గంటను కానుకగా సమర్పిస్తానని చెప్పారు. ఇక అదే జిల్లా హళింగలి గ్రామానికి చెందిన నరేష్ కూడా అదే దారిలో నడుస్తున్నాడు. వీరి పాదయాత్రను తిలకించి, వీరి భక్తితర్పరతకు దారిపొడవునా పెద్ద సంఖ్యలో జనం ఫిదా అవుతున్నారు. అనితర సాధ్యమనదగ్గ వీరి పాదయాత్ర ఆదివారం (మార్చి 8)న కర్నూలు జిల్లా మంత్రాలయం చేరుకుంది.
కాళ్లకు కర్రలు కట్టుకుని నడుస్తూ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నారు. అక్కడ నుంచి వారి సాహస భక్తియాత్ర శ్రైశైలం వైపు సాగింది. ఈ భక్తుల కర్రల నడక నెట్టింట తెగ వైరల్ అయ్యింది. భక్తి ఉండొచ్చు కానీ.. మరీ ఇంతా అని నెటిజనులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాళ్లకు కర్రలు కట్టుకుని ఐదువందల కిలోమీటర్ల ప్రయాణం నిజంగా సాహసమేనని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ సాహసోపేతమైన కర్రల నడక వారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి ఎక్కినా ఆశ్చర్యంలేదని వ్యాఖ్యానిస్తున్నారు.






