Latest News

11 ఏళ్ల వయస్సులోనే కంపెనీ సీఈవో.. వండర్ గర్ల్ శ్రీలక్ష్మి ప్రస్థానం స్ఫూర్తిమంతం!

posted on: Mar 9, 2026 3:00PM

పదకొండేళ్ల వయస్సంటే పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ తెలియని శైశవ దశ. వాన కురిస్తే.. మెరుపు మెరిస్తే.. ఆకసమున హరివిల్లు విరిస్తే.. అది నాకే అని మురిసిపోయే పసి వయస్సు.. అయితే శ్రీలక్ష్మి సురేష్ మాత్రం అలా కాదు. ఆమె ఒ వండర్ గర్ల్. 11 ఏళ్లకే ఓ కంపెనీకి సీఈవో . ఆమె సక్సెస్ స్టోరీ ప్రపంచానికే ఒక విస్మయం.    శ్రీలక్ష్మి సురేష్. టెక్నాలజీ ప్రపంచంలో తనకంటూ సొంతంగా ఒక అధ్యా యాన్ని లిఖించుకున్న అద్భుతం. 

కేరళలోని కోజికోడ్‌కు చెందిన శ్రీలక్ష్మికి బాల్యం నుంచే కంప్యూటర్లంటే ప్రాణం. కేవలం మూడేళ్ల వయసులో బొమ్మలు గీయడానికి ఎంఎస్ పెయింట్‌ను  వాడటం మొదలుపెట్టిన ఆ మె, ఆరేళ్ల వయస్సులోనే వెబ్ డిజైనింగ్ లో నిష్ణాతురాలైంది. తన కుటుంబ సభ్యుల ఫోటోలతో ఒక వెబ్‌సైట్‌ను రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

శ్రీలక్ష్మి చదువుకుంటున్న  ప్రెజెంటేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ కు అప్పట్లో వెబ్‌సైట్ లేదు.  శ్రీలక్ష్మి సురేష్ తన ఎనిమిదేళ్ల వయస్సులో తన స్కూల్ కోసం  వెబ్‌సైట్‌ను డిజైన్ చేసింది.  2006లో కేరళ అటవీ శాఖ మంత్రి దీనిని ప్రారంభించడంతో శ్రీలక్ష్మి పేరు అందరికీ పరిచయమైంది. 
ఆమె ప్రతిభను చూసి అద్భుతమైన అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. 2009లో కేవలం 11 ఏళ్ల వయసులో  ఈ డిజైన్ టెక్నాలజీస్  అనే వెబ్ డిజైనింగ్ కంపెనీని ప్రారంభించి, ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలైన సీఈఓగా కొత్త చరిత్ర సృష్టించింది. మైక్రోసాఫ్ట్, కోకాకోలా వంటి దిగ్గజ కంపెనీలకు కూడా ఈమె సేవలు అందించడం విశేషం. 

శ్రీలక్ష్మి సాధించిన విజయాలకు గుర్తింపుగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆమెను వరించాయి.  భారత ప్రభుత్వం నుంచి సోనియా గాంధీ చేతుల మీదుగా   నేషనల్ చైల్డ్ అవార్డ్,  అందుకున్నారు.

 వెబ్ డిజైనింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు అమెరికా నుంచి గోల్డెన్ వెబ్ ప అంతర్జాతీయ పురస్కారం దక్కింది.  ఇకపోతే   అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ వెబ్‌మాస్టర్స్  సంస్థలో 18 ఏళ్ల లోపు సభ్యత్వం పొందిన ఏకైక వ్యక్తి శ్రీలక్ష్మి. ప్రస్తుతం తన కంపెనీని మరింత విస్తరిస్తూ, ఐటీ రంగంలో మేటి సంస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో పట్టుదలగా పని చేస్తున్నారు శ్రీలక్ష్మి.   శ్రీలక్ష్మి సురేష్ విజయగాథ కేవలం  డిజిటల్ ప్రపంచంలో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక స్ఫూర్తి అనడంలో సందేహం లేదు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...