Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లోక్‌సభలో ముందుకు 3 కీలక బిల్లులు...డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిష్టంభన!
posted on: Apr 16, 2026 6:38PM

దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మూడు కీలక బిల్లులు లోక్‌సభ ముందుకు రావడంతో ఉత్కంఠ పెరిగింది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణలకు సంబంధించిన ఈ బిల్లులపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ నిర్వహించనున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఓటింగ్‌కు ముందు సుదీర్ఘ చర్చ జరగనుంది.
మూడు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, డీలిమిటేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టనుండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లును ప్రవేశపెడతారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ అమలు కోసం నియోజకవర్గాల పునర్విభజన అవసరమని కేంద్రం వాదిస్తోంది. ఈ క్రమంలో లోక్‌సభ స్థానాలను ప్రస్తుత 543 నుంచి 850కి పెంచే ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది.
అయితే, మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ‘ఇండియా’ కూటమి మహిళా రిజర్వేషన్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ, డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే, జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రభుత్వం డీలిమిటేషన్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని ఆరోపించారు. “మహిళా రిజర్వేషన్‌కు మేము మద్దతు ఇస్తాం. కానీ డీలిమిటేషన్‌తో గిమ్మిక్కులు చేస్తున్నారన్న అనుమానం ఉంది” అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో మూడింట రెండొంతుల మద్దతు అవసరం. అధికార ఎన్డీయే కూటమికి తగిన సంఖ్యలో సభ్యులు లేకపోవడంతో విపక్షాల మద్దతు కీలకంగా మారింది. సుమారు 18 గంటలపాటు కొనసాగే ఈ చర్చలు దేశ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకురావొచ్చని భావిస్తున్నారు.






