Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మహిళా బిల్లును అడ్డుకోవడం జాతి విద్రోహం...విపక్షాలపై చంద్రబాబు ఫైర్
posted on: Apr 18, 2026 3:44PM
.webp)
పార్లమెంటు వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాలు దేశ మహిళలకు, ప్రజాస్వామ్యానికి తీవ్ర ద్రోహం చేశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మహిళలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ చారిత్రక బిల్లును, సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకోవడం దారుణమని ఆయన విమర్శించారు.

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో శనివారం ఎన్డీఏ పక్షాలు ఏర్పాటు చేసిన భారీ నిరసన ర్యాలీలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య చరిత్రలో ఈ ఘటన ఒక ‘బ్లాక్ డే’ అని అభివర్ణించారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేసిన విపక్షాల తీరు, ఆడబిడ్డల పట్ల వారికున్న చులకన భావానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.
ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడమే కాకుండా, సమాజంలో వారి ఆత్మగౌరవం మరింత పెరుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి నష్టం జరగదని, సీట్ల పెంపుదల ద్వారా అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ, విపక్షాలు లేనిపోని సాకులు సృష్టించి అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు.
గతంలో తమ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిందని గుర్తు చేసిన చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం బిల్లును ముందుకు తీసుకురాలేకపోయిందని విమర్శించారు. నేడు రిజర్వేషన్లను నీరుగార్చడం ద్వారా ఆ పార్టీలు తమ అసమర్థతను, మహిళా వ్యతిరేకతను బయటపెట్టుకున్నాయని ఎద్దేవా చేశారు.
ఈ విద్రోహాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్తామని, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్న పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
.webp)
ఈ నిరసన కేవలం ఆరంభం మాత్రమేనని, మహిళల హక్కుల సాధన కోసం ఎన్డీఏ పక్షాలు భవిష్యత్తులో కూడా ఉద్యమాలను కొనసాగిస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మహిళలందరూ ఈ కుట్రను గమనించాలని, తగిన సమయంలో విపక్షాలకు సరైన సమాధానం చెప్పాలని ఆయన కోరారు.






