Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలోనూ బీజేపీ బెంగాల్ ఫార్ములా? వర్కౌట్ అవుతుందా?
posted on: Jun 29, 2026 11:53AM
.webp)
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ) వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పార్టీ తెలంగాణ నాయకత్వానికి దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని, అక్కడ క్షేత్రస్థాయిలో చేసిన ప్రజా పోరాటాలను తెలంగాణ బీజేపీ నేతలు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బెంగాల్ మోడల్ తరహాలోనే ఇక్కడ కూడా ప్రజా సమస్యలపై పోరాడి విజయం సాధించాలన్న నితిన్ నబీన్.. రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఇక ఎంత మాత్రం సహించబోమని స్పష్టమైన హెచ్చరిక చేశారు. అయితే తెలంగాణలో బెంగాల్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అంటే పరిశీలకులు మాత్రం ఆ అవకాశం ఇసుమంతైనా లేదంటున్నారు. బెంగాల్‌తో తెలంగాణను పోల్చడం సాధ్యం కాదని కుండబద్దలు కొడుతున్నారు.
పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాజకీయంగా భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. బెంగాల్‌లో సుదీర్ఘ కాలం పాటు పని చేసిన కమ్యూనిస్టులు క్షేత్రస్థాయిలో పూర్తిగా పట్టు కోల్పోవడం బీజేపీకి ప్లస్ పాయింట్ అయ్యింది. దానికి తోడు అక్కడ తృణమూల్ కాంగ్రెస్పై తీవ్రమైన అవినీతి, అక్రమాల ముద్ర పడటం, మమతా బెనర్జీ తర్వాత వారసుడిగా కుటుంబ సభ్యులను ముందుకు తీసుకురావడాన్ని బెంగాల్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. వీటన్నింటికీ మించి బెంగాల్‌లో సువేందు అధికారి లాంటి బలమైన, మాస్ ఇమేజ్ ఉన్న ఒక ఐకాన్ లీడర్ బీజేపీకి దొరకడం కలిసి వచ్చింది. ఈ రాజకీయ, సామాజిక సమీకరణాలే అక్కడ బీజేపీ విజయానికి మార్గం సుగమం చేశాయి.
కానీ.. అటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై గానీ, సీఎంపై గానీ ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. అదే సమయంలో ఈ మూడేళ్లలో కాంగ్రెస్ సర్కార్ పై అవినీతి ముద్ర పడిన దాఖలాలు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో కొన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ.. వాటిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్లో బలమైన నేతగా, మాస్ లీడర్‌గా, అసెంబ్లీ లోపలా బయటా గట్టిగా గళం ఎత్తగల నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇటువంటి బలమైన వ్యూహకర్తను ఢీకొట్టడం బీజేపీ అంత సులభ సాధ్యం కాదని పరిశీలకులు అంటున్నారు. మరోవైపు.. బెంగాల్‌లో సువేందు అధికారి తరహాలో రాష్ట్రం మొత్తం ప్రభావం చూపించగల నాయకుడు ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ఎవరూ కనిపించడం లేదని చెబుతున్నారు. అలాగే తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతల మధ్య అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరాటాలు, కుమ్ములాటలు క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను గందరగోళంలో పడేశాయని చెబుతున్నారు.
అలాగే.. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితికి క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంక్ ఇప్పటికీ బలంగానే ఉండటం కూడా బీజేపీకి అధికారం అంత సులువుగా దక్కదన్న అభిప్రాయానికి కారణం అవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో త్రిముఖ పోటీ తధ్యమని పరిశీలకులు అంటున్నారు. ఆ కారణంగానే.. బెంగాల్ తరహా ఏకపక్ష వ్యూహాలు ఇక్కడ ఫలించే అవకాశాలు అంతంత మాత్రమేనని విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి రాష్ట్ర విభజన జరిగి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నా.. విభజన చట్టంలో పేర్కొన్న పలు కీలక ప్రాజెక్టులు, హామీలు, తెలంగాణకు రావాల్సిన నిధులు వంటి హామీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిగా నెరవేర్చలేదనే అసంతృప్తి స్థానికంగా చాలా చాలా బలంగా ఉంది. తెలంగాణ ఆవిర్భావానికి పార్లమెంట్‌లో తాము కూడా మద్దతు తెలిపామని బీజేపీ క్రెడిట్ కోరుకుంటున్నప్పటికీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పుష్కర కాలంలో రాష్ట్రానికి చేసిన ఆర్థిక సాయం ఎంత అనే ప్రశ్నకు రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పలేక తడబడుతున్న పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే.. కేవలం బెంగాల్ ఫార్ములాను నమ్ముకుని తెలంగాణలో పాగా వేయాలనుకోవడం నేల విడిచి సాము చేయడంగా మారుతుందన్నది పరిశీలకుల విశ్లేషణ.


.webp)



