ఇక కవిత టార్గెట్ కేసీఆరేనా?
posted on: Feb 19, 2026 9:41AM
.webp)
ఫిబ్రవరి 17న కేసీఆర్ తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. అయితే కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనను విష్ చేస్తూ ఆయన కన్న కూతురు, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన ట్వీట్ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది.
కేసీఆర్ తన దేవుడని ఒకప్పుడు చెప్పుకున్న కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఆయన జన్మదినం సందర్భంగా చేసిన ట్వీట్ లో గౌరవనీయులు, ఉద్యమ నాయకులు, పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అని మాత్రమే పేర్కొన్నారు. కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత తన బంధాన్ని వదులుకున్నారా? అన్న చర్చ రాజకీయవర్గాలలో జరుగుతోంది. కుటుంబ విభేదాలు, రాజకీయంగా వేరుదారులకు మించి కవిత చాలా దూరం వెళ్లారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా కేసీఆర్ కు కాళేశ్వరం అవకతవకల విషయంలో నోటీసులు జారీ అయిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నాను గుర్తు చేస్తూ.. ఇప్పుడు కాళేశ్వరాన్నే దండగ ప్రాజెక్టు అని విమర్శించే వరకూ వెళ్లారని చెబుతున్నారు. ఇప్పటి వరకూ తన విమర్శలను తొలుత హరీష్ రావు, సంతోష్ లను టార్గెట్ చేయడానికే పరిమితం చేసిన కవిత.. ఆ తరువాత బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సొంత అన్నా కేటీఆర్ ను టార్గెట్ చేశారు. ఇక ఇకముందు కేసీఆర్ టార్గెట్ గా తన విమర్శల బాణాలను ఎక్కుపెట్టేందుకు సమా యత్తమౌతున్నారనడానికి తాజా ట్వీటే నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. మొత్తం మీద కల్వకుంట్ల కవిత రాజకీయంగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా బీఆర్ఎస్ కు, కల్వకుంట్ల ఫ్యామిలీకి దూరం జరిగారని అంటున్నారు.






