ఫార్మా కంపెనీలు టాబ్లెట్స్ మధ్యలో గీత వచ్చేలా చేస్తారు ఎందుకు? దీని వెనుక రహస్యం ఏమిటంటే!

posted on: Apr 21, 2026 3:00PM

 ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు, కానీ చాలా మందులకు ఉంటుంది.  ఈ టాబ్లెట్ల మీద గీత చూసిన చాలామంది ఇది ఒక డిజైన్ అని అనుకుంటారు, కానీ ఈ గీత వెనుక పెద్ద కథే ఉంది.. వైద్య పరిభాషలో, ఈ గీతను స్కోర్ లైన్ అంటారు. మందును సమాన భాగాలుగా విభజించడానికి ఈ గీతను రూపొందిస్తారని  నిపుణులు చెబుతున్నారు. టాబ్లెట్స్ పైన ఈ గీతలు ఎందుకు ఉంటాయి.  ఫార్మా కంపెనీలు ఇలా టాబ్లెట్ల మీద గీతలు ఉంచడం వెనుక కారణం ఏంటి?  వివరంగా తెలుసుకుంటే..

టాబ్లెట్ల మీద గీత..

నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని మాత్రలపై ఉండే గీత మందును సమాన భాగాలుగా విడగొట్టడానికి సహాయపడుతుంది, తద్వారా రోగులు సులభంగా సగం మాత్రను తీసుకోవచ్చు. వైద్యులు తరచుగా సగం మాత్ర మోతాదును కూడా సూచిస్తారు. ఈ గీత మాత్రను సగానికి విరవడాన్ని సులభతరం చేస్తుంది. రోగికి సరైన మోతాదు అందేలా చూసుకోవడానికి, మాత్రను తయారుచేసేటప్పుడు ఈ గీత వచ్చేలా చేస్తారట.

గీతలు లేని టాబ్లెట్లు..

మందుపై గీత లేని మాత్రలు. అంటే, టాబ్లెట్ల పై  గీత లేకపోతే ఆ మాత్రను విరవకూడదట. లేకపోతే, దాని ప్రభావం తగ్గిపోవచ్చట. కొన్ని మందులకు ఎంటెరిక్ కోటింగ్ లేదా సస్టెయిన్డ్ రిలీజ్ వంటివి ఉంటాయని, వాటిని విరిస్తే టాబ్లెట్ల ప్రభావం మారవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే గీత లేని టాబ్లెట్లను విరవడం వల్ల దుష్ప్రభావాల ప్రమాదం పెరగవచ్చని అంటున్నారు.

డిజైన్ మాత్రం కాదు..

నిపుణుల అభిప్రాయం ప్రకారం, టాబ్లెట్ మధ్యలో ఉండే గీత కేవలం డిజైన్ కోసం పెట్టేది కాదు.  అది టాబ్లెట్ డోస్ తీసుకోవడానికి సహాయపడుతుంది. ఆ గీత టాబ్లెట్‌ను సులభంగా విరవడానికి వీలు కల్పిస్తుంది. టాబ్లెట్ లో సగం డోసు తీసుకోవాల్సిన వారు  టాబ్లెట్‌ను సమాన భాగాలుగా విరవకపోతే సరైన డోస్ తీసుకోలేరు. దీని వల్ల  మందు కూడా ప్రభావవంతంగా పనిచేయదు.

                                *రూపశ్రీ.

google-ad-img
    Related Sigment News
    • Loading...