Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎవరిని ధ్వంసం చేస్తారు.. పొలిటికల్ ఫ్లెక్సీలపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
posted on: Apr 10, 2026 9:41AM
.webp)
పొలిటికల్ ఫ్లెక్సీల సంస్కృతి, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం సామాన్య ప్రజలను, వ్యవస్థలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం తగదంటూ హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు శ్రుతిమించుతున్నాయని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని పేర్కొంది. వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారిని ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండకూడదని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఇటువంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయంటూ హైకోర్టు మండిపడింది. గతంలో న్యాయమూర్తులను సైతం లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టిన సందర్భాలను గుర్తు చేస్తూ, అప్పట్లోనే కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని అభిప్రాయపడింది. ఒకసారి అరెస్టయిన వారు మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తున్నారంటే లోపం ఎక్కడుందో ఆలోచించాలని సూచించింది.
ముఖ్యంగా ముఖ్యమంత్రి వంటి గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తిని దూషించడం అంటే, ఆ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలను అవమానించడమేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఎవరి కుటుంబ గౌరవానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని, రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని హితవు పలికింది. కేవలం అధికారం కోసం లేదా రాజకీయ కక్ష సాధింపునకు ఇలాంటి అరాచక సంస్కృతిని ప్రోత్సహించడం సరికాదని హైకోర్టు విస్పష్టంగా పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించిన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్ చేసింది.





