పాకిస్థాన్‌ బాస్ ఎవరు?...ట్రంప్ పోస్టుతో కలకలం

posted on: May 29, 2026 7:18PM

 

ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను ఇంధనంతో సహా పలు సంక్షోభాలకు గురిచేస్తున్నాయి. ఆ దేశాల మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ రాయబారం వహిస్తోంది. ఆ క్రమంలో పాక్ మధ్యవర్తిత్వ చర్చలు ఇంతవరకూ సానుకూల ఫలితాలు ఇవ్వలేదు. అయితే ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని.. ఈ చారిత్రాత్మక ఒప్పందం విజయవంతమైతే ప్రాంతీయంగా అపారమైన ఆర్థిక, సామాజిక వృద్ధి సాధ్యమవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు.  ఆ శాంతి చర్చల నేపథ్యంలో ప్రపంచ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, రాజులతో కూడిన ఈ ప్రతిష్టాత్మక జాబితాలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేరు మాయం కావడం సంచలనంగా మారింది.

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ వంటి అగ్రనేతలతో తాను జరిపిన చర్చలను ట్రంప్ ప్రస్తావించారు. వీరందరితో పాటు పాకిస్థాన్ కూడా ఏకకాలంలో ఈ ఒప్పందంపై సంతకం చేయాలని ఆయన ఆకాంక్షించారు. అయితే మిగతా దేశాల ప్రతినిధులను వారి రాజ్యాంగబద్ధమైన పదవులతో ట్రంప్ గుర్తించగా.. పాకిస్థాన్ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేరును పక్కనపెట్టి.. ఆ దేశ సైనిక చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను అధికారిక ప్రతినిధిగా పేర్కొన్నారు. ఇటీవలే ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ సంబంధాల నేపథ్యంలో జరిగిన దౌత్యపరమైన భేటీలలో కూడా ఆసిమ్ మునీరే కీలక పాత్ర పోషించారు. 

ఆయన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌తో నేరుగా చర్చలు జరపడం గమనార్హం. ట్రంప్ చేసిన ఈ ఒక్క పోస్ట్‌తో పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కంటే మిలిటరీదే పైచేయి అనే చేదు నిజం అంతర్జాతీయ వేదికపై మరోసారి రుజువైంది. పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి జాతీయ భద్రత, విదేశాంగ విధానాలపై అక్కడి సైన్యమే నిర్ణయాత్మక శక్తిగా ఉంటూ వస్తోంది. ఈ ద్విముఖ పాలనకు చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా 1999లో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు చారిత్రాత్మక లాహోర్ ప్రకటన ద్వారా శాంతి కోసం ప్రయత్నించారు. 

కానీ ప్రధానికి తెలియకుండానే జనరల్ పర్వేజ్ ముషారఫ్ కార్గిల్  దురాక్రమణకు పాల్పడ్డారు. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్‌లో ముషారఫ్ సైనిక తిరుగుబాటు చేసి నవాజ్ షరీఫ్‌ను నిర్బంధించి సైనిక పాలనను విధించారు.చారిత్రాత్మకంగా పాకిస్థాన్.. ఇజ్రాయెల్‌ను ఒక స్వతంత్ర దేశంగా గుర్తించడానికి నిరాకరిస్తూ వస్తోంది. స్వతంత్ర పాలస్తీనా రాజ్యం ఏర్పడిన తర్వాతే సత్సంబంధాలు ఉంటాయని ఆ దేశం చెబుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రతిపాదించిన అబ్రహం అకార్డ్స్‌లో పాకిస్థాన్ చేరడం అంత సులువు కాదు. దీనివల్ల ఆ దేశంలో తీవ్రమైన అంతర్గత రాజకీయ, ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ.. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ తర్వాత వాషింగ్టన్‌తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి అటు పాక్ ప్రభుత్వం, ఇటు మిలిటరీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...