ఇంతకీ ఎవరీ హిడ్మా
posted on Nov 18, 2025 12:30PM

ఆయన చాలా సౌమ్యంగా, మృదువుగా మాట్లాడుతారు. ఆయన మాట తీరు విని ఈయనేనా ఇంత విధ్వంసం సృష్టించింది అని అంతా అనుకుంటారంటూ హిడ్మా గురించి చెబుతారు ఆయనని తెలిసిన వారు. అత్యంత సౌమ్యంగా మాట్లాడే ఈ హిడ్మాయే దాదాపు పదికి పైగా మావోయిస్టు దాడులలో కీలక పాత్రపోషించి, పెద్ద సంఖ్యలో భద్రతా బలగాల మరణానికి కారణమయ్యాడు. మోస్ట్ వాంటెడ్ హిడ్మా సొంత గ్రామం చత్తీస్ గఢ్ రాష్ట్రం లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామం. ఆ గ్రామం నుంచి దాదాపు 40-50 మంది మావోయిస్టులు ఉంటారని అంచనా. పార్టీ లోకి రాకముందు హిడ్మా వ్యవసాయం చేసుకు నేవాడు. ఎక్కువగా మాట్లాడే అలవాటు లేని హిడ్మా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తాడు.
ఆ క్రమంలోనే మావోయిస్టు పార్టీతో కలసి పనిచేసిన ఒక లెక్చరర్ ద్వారా ఇంగ్లీషు నేర్చుకున్నాడు. హిడ్మా కి దక్షిణ బస్తర్ లోని దండకా రణ్యంలో తిరుగులేని పట్టు ఉంది. అసలు మావోయిస్టు పార్టీలో హిడ్మా ఎదుగుదల ఒక ఆశ్చర్యకర ప్రస్థానం. 1996-97 ప్రాంతంలో తన 17వ ఏట మావోయిస్టు పార్టీలో చేరిన హిడ్మాకు హిద్మల్లు, సంతోష్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. 17 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీ బాలల సంఘంలో చేరి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు.ఆ తర్వాత మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తు న్నారు.
మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ దాడుల్లో హిడ్మా అత్యంత కీలకంగా వ్యవహరించాడు. హెడ్మాపై కోటి,ఆయన భార్యపై 50 లక్షల రూపాయల రివార్డులు ఉన్నాయి. చత్తీస్గడ్ లో కగార్ ఆపరేషన్ తీవ్రతరం కావడంతో హిడ్మా చత్తీస్గడ్ ప్రాంతం నుండి ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తలదాచు కుంటున్నాడు. హిడ్మాకు హిందీ, గోండు, కోయ, తెలుగు,బెంగాలీ వంటి భాషలపై పట్టు ఉంది. 2010 ఏప్రిల్ 6న అప్పటి ఉమ్మడి దంతేవాడ జిల్లా తాడిమెట్ల,చింతల్ నార్ అటవీ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ బలగాలపై జరిగిన అంబుష్ (మెరుపుదాడి)లో హిడ్మాదే కీలక పాత్ర. ఆ మెరుపుదాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ తరువాత 2017లో 25 మంది, 2021లో బీజాపూర్ జిల్లాలో 23 మంది జవాన్ల మృతి చెందిన దాడుల వెనుక కూడా హిడ్మాయే ఉన్నాడు.