Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తుమ్మల వెనుక అదృశ్యహస్తం ఎవరిది?
posted on: Sep 2, 2014 4:29PM
.jpg)
చెరువు మీద అలిగిన సామెత చందాన తెలుగుదేశం పార్టీని విడిచిపెడతా... విడిచిపెడతా అని ఎప్పటి నుంచో బెదిరిస్తూ వచ్చిన ఖమ్మం జిల్లా తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు ఎట్టకేలకు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తెలుగుదేశం అధినేతకు ఏకవాక్య రాజీనామా లేఖను రాసేసి, ఆ లేఖమీద సంతకం చేసే సమయంలో కన్నీరు కూడా పెట్టుకుని సెంటిమెంట్ సీన్ పండించారు. ఎన్టీఆర్ హయాం నుంచి తెలుగుదేశం పార్టీలో వున్న తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఖమ్మం జిల్లా టీడీపీలోని తన ప్రత్యర్థి నామా నాగేశ్వరరావును సాకుగా చూపించి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టారు. ఇటీవల తుమ్మల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సహా పలువురు తెలుగుదేశం నాయకులు తుమ్మలను పరామర్శించారు. తమ సొంత మనిషి అనారోగ్యానికి గురయ్యారన్న సానుభూతిని ప్రదర్శించారు. అయితే ఆ సమయంలో తుమ్మల త్వరలో చేరబోయే పార్టీకి సంబంధించిన వారెవరూ పరామర్శించిన పాపాన పోలేదు. దీన్ని గమనించైనా తుమ్మల తెలుగుదేశం పార్టీని వీడరన్న అభిప్రాయాలు కలిగాయి. అయితే, తుమ్మల ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మర్నాడు చేసిన ఘనకార్యం తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టడమే. తుమ్మల తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టడం పార్టీకి నష్టమా, ఆయనకే నష్టమా, పార్టీని విడిచినందుకు ఆయనకు లభించిన ‘హామీలు, తాయిలాలు’ వాస్తవరూపాన్ని ధరిస్తాయా, చివరకు చెవిలో పూలుగా మిగులుతాయా.... ఇలాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. అయితే ఎంతో అనుబంధం వున్న తెలుగుదేశం పార్టీని తుమ్మల విడిచిపెట్టడం వెనుక వున్న అదృశ్యహస్తం గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అధినేతగా వున్న ఒక వ్యక్తి అదృశ్య హస్తం తుమ్మల తెలుగుదేశం పార్టీ వీడటానికి కారణమైందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ ‘మీడియా వ్యక్తి’ తుమ్మలకు సన్నిహితుడు. ఆయనగారు తుమ్మలకు తెలుగుదేశం పార్టీలో వున్న అసంతృప్తిని కనిపెట్టారు. అలాగే తెలంగాణలోని అధికార పార్టీకి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడి అవసరాన్నీ గుర్తించారు. ప్రస్తుతం తెలంగాణలో తన మీడియా సంస్థకు సంబంధించి ఇబ్బందిని ఎదుర్కొంటున్న ఆయన ఒకే దెబ్బకు మూడు పిట్టలు పడేలా ఒక పథకం ఆలోచించారు. అది తుమ్మలను తెలుగుదేశం నుంచి బయటకి తీసుకొచ్చి తెలంగాణ పార్టీలో చేర్పించడం ద్వారా అటు తుమ్మలకు వున్న అసంతృప్తిని తొలగించడం, ఇటు తెలంగాణ పార్టీకి ఉన్న నాయకత్వ లోటుని తీర్చడం. ఈ ఉభయులకూ ఈ మేలు చేయడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో తన మీడియాకి వున్న ఇబ్బందికర పరిస్థితులు తొలగిపోయేలా చేసుకోవడం. ఈ ప్లాన్‌తో పావులు కదిపి, సంప్రదింపులు జరిపిన ఆయన ఇప్పటి వరకు కొంతమేర సక్సెస్ అయ్యారు. కాకపోతే ఈ ఎపిసోడ్‌లో ట్విస్ట్ ఏమిటంటే, సదరు మీడియా వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా సన్నిహితుడు కావడం. అంటే, తన మీడియా సంస్థను కాపాడుకోవడం కోసం తన సన్నిహితుడి పార్టీకే చిల్లు పెట్టడానికి ఆవ్యక్తి పూనుకున్నాడన్నమాట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాలవారు తుమ్మల పేరు చెబితే ఎంత కస్సుమంటున్నారో సదరు ‘మీడియా వ్యక్తి’ పేరు చెప్పినా అంతకంటే ఎక్కువ బుస్సుమంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికైనా ఆ వ్యక్తి అసలు స్వరూపాన్ని అర్థం చేసుకుని దూరంగా పెడితే మంచిదని భావిస్తున్నారు.


.jpg)
.jpg)


