‘ఎర్ర’ దొంగలు ‘పెద్దాయన’ తాలూకేనా?
posted on: Sep 19, 2014 5:30PM
.jpg)
ఎర్ర చందనం దొంగల గురించి పరిశోధించేకొద్దీ అనేక నిజాలు బయటపడుతున్నాయి. ఎర్ర చందనం దొంగల వెనుక వున్న ‘పెద్దమనుషుల’ పేర్లు బయటకి వస్తున్నాయి. ఇంతకాలం తమిళనాడు నుంచి వస్తున్న ఎర్ర చందనం కూలీలు, దొంగల సహకారంతో స్థానికంగా వున్న కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం చెట్ల కొట్టివేత, ఎర్ర చందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అనుకుంటూ వచ్చారు. అయితే ఈ ఘనకార్యంలో కొంతమంది పోలీసు అధికారుల హస్తం వున్నట్టు బయటపడింది. వారి వెనుక రాజకీయ నాయకుల హస్తం కూడా వుండొచ్చన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు ఎర్రచందనం దొంగల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పరిశోధన జరుపుతున్నారు. ఇటీవలి కాలంలో అనేకమంది దొంగల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుకుంది. వారి దగ్గర్నుంచి కీలక సమాచారం రాబట్టింది. ఈ సమాచారంతో ఎర్రచందనం దొంగలకు సహకరిస్తున్న ఇద్దరు ఇంటిదొంగలను పట్టేసింది. ఇంతకాలం ఎర్రచందనం దొంగలకి సహకరిస్తూ సొంత ఇంటికే కన్నం వేస్తున్న ఇద్దరు పోలీసు అధికారులు అడ్డంగా దొరికిపోయారు. ఆ ఘనులు ఎవరో కాదు... ఒకరు మాజీ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ జి. ఉదయ్ కుమార్, మరొకరు రాజంపేట డిఎస్‌పి జి.వి.రమణ. ఎర్రచందనం చెట్లు ఎవరూ కొట్టేయకుండా, ఎర్ర చందనం స్మగ్లింగ్ జరక్కుండా చూడండయ్యా అని వీళ్ళకి బాధ్యతలు ఇస్తే, వీళ్ళే నెలనెలా ‘కానుకలు’ అందుకుంటూ ఎర్రచందనం దొంగలకు, వారి వెనుక వున్న ‘పెద్దమనుషులకు’ అండగా నిలిచారు. ఆమధ్య కోటి రూపాయల విలువైన ఎర్రచందనం లారీ దొరికిపోయినప్పుడు దాని వెనుక ఎర్రచందనం డాన్ గంగిరెడ్డి మామ పేరు బయటపడింది. అయితే ఎఫ్ఐఆర్ రాసేప్పుడు వీరిద్దరూ ఉద్దేశపూర్వకంగా గంగిరెడ్డి మామ పేరును తప్పించారు. ఇంతేకాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో వీరిద్దరి ‘ఇన్వాల్వ్‌మెంట్’ ఒక్కటొక్కటిగా బయట పడుతోంది.
ఎర్రచందనం డాన్ గంగిరెడ్డి ఎంత ఘనుడో అందరికీ తెలిసిందే. గతంలో చంద్రబాబు నాయుడిని చంపడానికి ప్లాన్ చేసిన చరిత్ర కూడా అతనికి వుంది. గంగిరెడ్డి వెనుక వున్న ‘రాయలసీమ రాజకీయ శక్తులు’ కూడా ఎవరో బహిరంగ రహస్యమే. ఇప్పుడు సస్పెన్షన్‌కి గురైన ఇద్దరు పోలీసు అధికారులలో జి.ఉదయ్ కుమార్‌కి కూడా ఆ ‘రాజకీయ శక్తులతో’ సన్నిహిత సంబంధాలు వున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన పదవిలో వుండి, అందరిచేతా ‘పెద్దాయన’ అని పిలిపించుకున్న పెద్దమనిషి ఉదయ్‌కుమార్‌ని తన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమించుకున్నారు. ఆ పెద్దాయనకు అంత నమ్మకస్తుడిగా వున్న ఉదయ్ కుమార్ ఇప్పుడు ఎర్రచందనం కేసులో దొరికిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు రాష్ట్రంలో ఎర్రచందనం దొంగల వెనుక వున్న అసలు వ్యక్తి ఎవరనే దానిమీద ఇప్పటికే ఉన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం మరింత పకడ్బందీగా విచారణ ఎర్రచందనం దొంగల వెనుక వున్న అసలు దొంగలు బయటపడతారు.



.jpg)
.jpg)

.webp)



