డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలిగిన అమెరికా
posted on: Jan 23, 2026 1:56PM
.webp)
ప్రపంచ ఆరోగ్య సంస్థ .. డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలుగుతూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. డబ్ల్యూహెచ్ఓని అధికారికంగా వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. కొవిడ్‌ని అదుపు చేయడంలో, సంస్కరణల అమలులో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందని పేర్కొంటూ ఈ సంచలన నిర్ణయం వెలువరించింది. ఇకపై డబ్ల్యూహెచ్‌ఓకు తమ దేశం నుంచి వచ్చే అన్నిరకాల నిధులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న డబ్ల్యూహెచ్‌ఓ కార్యాలయాల నుంచి అమెరికా సిబ్బందిని వెనక్కి పిలిపించుకుంటున్నట్లు వెల్లడించింది. ఆ సంస్థకు సంబంధించిన సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి వైదొలిగింది. ఇక నుంచి పరిమిత పరిధుల మేరకు డబ్ల్యూహెచ్‌ఓతో కలిసి పనిచేయనున్నట్లు యూఎస్ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. యూఎస్ ప్రెసిడెంట్‌గా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ పలు సందర్భాల్లో డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలుగుతామని ప్రకటించారు.
ఈ నేపధ్యంతో తాజా అగ్రరాజ్యం తన నిర్ణయాన్న ప్రకటించి కలకలం రేపింది. అయితే డబ్ల్యూహెచ్‌ఓ నుంచి యూఎస్ వైదొలిగే సమయానికి ఆ దేశం డబ్ల్యూహెచ్‌ఓకు 260 మిలియన్ డాలర్లు .. అంటే రూ.2,382 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని బూమ్‌బెర్గ్ నివేదికలు వెల్లడించడం గమనార్హం.






