తిరువూరు తుఫాన్ ఏ తీరం చేరేనో?

మొన్న‌టి వ‌ర‌కూ దేవుడ్న‌యిన నేను స‌డన్ గా  దెయ్యాన్ని ఎలా అయ్యాను? ఇదీ బెజ‌వాడ ఎంపీ కేశినేని చిన్ని చేసిన కామెంట్. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస‌రావు అంటేనే అదో నాన్ స్టాప్ న్యూసెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా పేరు. ప్ర‌త్యేకించి ఒక‌రొచ్చి ఇదేంటి అని వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న ఏమ‌ని తిరువూరు ఎమ్మెల్యేగా ఎంపిక‌య్యారో అప్ప‌టి నుంచి న‌డుస్తోన్న త‌తంగ‌మంతా ఒక్క‌సారి రీకాల్ చేసి చూస్తే చాలు.. ఒక క్లారిటీకి రావ‌చ్చు.

తాజాగా కొలికపూడి మ‌రో వివాదం రాజేశారు.  ఎంపీ చిన్ని త‌న‌ను ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 5 కోట్లు అడిగార‌ంటూ బాంబు పేల్చారు. అంతే కాదు.. తాను ఇచ్చాన‌ని చెప్ప‌డానికి  త‌గిన ఆధారాలు సైతం చూపించారు. మొద‌ట చిన్ని పీఏకి యాభై ల‌క్ష‌లు ఇచ్చామ‌నీ.. ఆపై త‌న స్నేహితుల ద్వారా 3. 5 కోట్ల రూపాయ‌లు ఇచ్చామ‌ని.. త‌న బ్యాంకు డీటైల్స్ తో స‌హా కొలికిపూడి మీడియాకి లీక్ చేయ‌డంతో చిన్నికి ఏం చేయాలో పాలు పోలేదు. అది కూడా ఎంత నాట‌కీయంగా అంటే..  గురువారం (అక్టోబర్ 23) ఉద‌యం నుంచి తిరువూరులోనే ఉన్న ఎంపీ చిన్ని వివిధ ర‌కాల కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అయితే  ఎమ్మెల్యే కొలికపూడి ఆ కార్యక్రమాలకు హాజరు కాకుండా.. ఈ మ‌నీ మేట‌ర్  లీక్ చేసే స‌రికి తెలుగు త‌మ్ముళ్లకు దిమ్మ తిరిగిపోయింది.

ఈ విష‌యం హుటాహుటిన యూఏఈలో ఉన్న బాబుకు తెలియ చేయ‌గా.. ఆయ‌న ఆగ్ర‌హించి.. వీరిద్ద‌రితో మాట్లాడ్డానికి స‌సేమిరా అన్నారు. ఇదే అంశంపై చిన్ని మాట్లాడుతూ.. తన‌కు అధిష్టానం నుంచి ఎలాంటి పిలుపు రాలేద‌ని అన్నారు. తాను రోజుకో ర‌కంగా వ్య‌వ‌హ‌రించే వైసీపీ మైండ్ సెట్ తో లేన‌ని.. త‌న  బార్న్అండ్  బ్రాట‌ప్ మొత్తం టీడీపీయేని చెప్పుకున్న కేశినేని చిన్ని.. తాను ఫ‌క్తు టీడీపీ వాదిన‌న్నారు. తానేంటో విజ‌య‌వాడ ప్ర‌జ‌ల‌కు బాగా తెలుసున‌ని.. త‌న సొంత ఖ‌ర్చుతో విజ‌య‌వాడ ఉత్స‌వాలు జ‌రిపాన‌ని.. మ‌ర‌లాంటి త‌న‌కు ఏంటీ ఈ లంచాల గోల‌? అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ఇక కొలికపూడి  విషయానికి వస్తే.. ఆయ‌న త‌న ఫేస్ బుక్ స్టేట‌స్ లో ర‌క‌ర‌కాల కామెంట్ల‌ను పెట్టి పార్టీలో ఒక‌ర‌క‌మైన అల‌జ‌డికి కార‌కుడ‌య్యారు. ఎవ‌రంటే వారొచ్చిపోయేది కాదు తిరువూరు అంటూ ఆయ‌న చేసిన కామెంట్ల‌కు అర్ధ‌మేంట‌ని బుర్ర గోక్కున్నాయి పార్టీ శ్రేణులు. ఎంపీ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌డానికి ఎమ్మెల్యే ప‌ర్మిష‌న్ కావాలా? అంటూ నిలదీస్తున్నాయి.  

ఇప్ప‌టికే ప‌లు మార్లు.. తిరువూరు వ్య‌వ‌హారం టీడీపీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.  తాజాగా ఇప్పుడు మ‌రొక‌టి. ఇదెంత పెద్ద వ్య‌వ‌హారం అంటే.. ఏకంగా ఒక పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఇష్యూ. ఈ మేట‌ర్లో.. ఇటు ఎమ్మెల్యే వ‌ర్సెస్ ఎంపీ మాత్ర‌మే కాదు.. పార్టీ ప‌రువు ప్ర‌తిష్ట‌లు మొత్తం దాగి ఉండ‌టంతో.. త‌మ్ముళ్ల‌లో తెగ‌ చ‌ర్చ న‌డుస్తోంది. కొంద‌రైతే.. అర్హులు కాని వారిని అంద‌ల‌మెక్కిస్తే ఇలాగే ఉంటుంద‌ని కొలికపూడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ఆనాడు టీడీపీకి  ప్రోగా కొలికిపూడి కామెంట్లు చేస్తే.. ఎంతో గొప్ప మ‌ద్ధ‌తుదారుడు దొరికాడ‌ని సంబ‌ర ప‌డ్డాం.. ఇప్పుడు చూస్తే నాటి వైసీపీ రెబ‌ల్ ఎంపీ కి మించి పెర్ఫామెన్స్ చేస్తున్నారీరెబ‌ల్ ఎమ్మెల్యే అంటూ కొంద‌రు త‌మ్ముళ్లు సామాజిక  మాధ్య‌మాల్లో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మ‌రి చూడాలి..  ఈ తిరువూరు తుఫాన్ ఏ తీరం చేర‌నుందో ?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu