Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గ్రేహౌండ్స్ కి ఇక పని లేదా?!
posted on: Feb 28, 2026 10:48AM

మావోయిస్టు ఉద్యమం దాదాపుగా అంతిమ దశకు చేరుకున్న పరిస్థితిలో, గ్రేహౌండ్స్, ఎస్ఐబీ వంటి ప్రత్యేక దళాల భవిష్యత్తు ఏంటి? వాటికి ఇక పని లేదా? ఆయా విభాగాలు ఇక కనుమరుగు అయిపోతాయా? అన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే, ఉద్యమం నశించినా గ్రేహౌండ్స్ వంటి దళాలు పూర్తిగా కనుమరుగు కావు, వాటి రూపురేకలు, బాధ్యతలు మారొచ్చని అంటారు నిపుణులు.
గ్రేహౌండ్స్ దళాల సృష్టికర్త ఎవరు? మావోయిస్టులపై దాని ప్రభావమెంత? పర్యావశానాలేంటి? అని పరిశీలిస్తే.. 1989లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు హయాంలో ఈ ప్రత్యేక దళం ఏర్పాటైంది. అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు అడవుల్లో గెరిల్లా రీతిలో దాడులు చేస్తూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరిగేవారు. సాధారణ పోలీసు కెపాసిటీ అడవుల్లో పని చేయదని గుర్తించిన కేఎస్ వ్యాస్.. అడవిబిడ్డను అడివిలోనే కొట్టాలి.. అనే ఐడియాతో ఈ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఈ దళాన్ని సృష్టించిన కేఎస్ వ్యాస్ 1993 లో హైదరాబాద్ లోని లాల్ బహుదూర్ స్టేడియంలో మావోయిస్టులు కాల్చి చంపారు.
అదలా ఉంచితే.. మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రంగా ఇరుకున పెట్టిన ఘనత గ్రేహౌండ్స్ దళాలదే అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు అడవులు మావోయిస్టులకు ఒక కవచంలా ఉండేవి. అయితే గ్రేహౌండ్స్ దళాలు అవే అడవుల్లోకి చొచ్చుకుని వెళ్లి మరీ మావోయిస్టులకే చుక్కలు చూపించాయి. ఇంతకీ ఈ దళాల ప్రత్యేకతలేమింటంటే.. గ్రేహౌండ్స్ దళ సభ్యులు.. వారం పది రోజుల పాటు నిద్రాహారాలు మాని.. మాటు వేయగలరు. దీంతో మావోయిస్టు అగ్రనేతలు సురక్షిత ప్రాంతాల కోసం పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్ గఢ్ కి పారిపోవల్సి వచ్చేది. ఎన్ కౌంటర్ల ద్వారా నల్లమల, ఏఓబి దాడుల ద్వారా మావోయిస్టు నాయకత్వాన్ని గ్రేహౌండ్స్ తుడిచిపెట్టేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు ఉద్యమం దాదాపు నామరూపాలు లేకుండా పోవడానికి గ్రేహౌండ్స్ దళం ప్రధాన కారణం. అడవుల్లో హింస తగ్గడంతో మారుమూల గిరిజన ప్రాంతాలకు రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు వచ్చి చేరాయి. నేడు అమెరికాలోని గ్రీన్ బెరెట్స్ వంటి దళాలు గ్రేహౌండ్స్ శిక్షణను అధ్యయనం చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఏర్పడిన గ్రేహౌండ్స్ తరహా దళాలకు..ఉదాహరణకు మహారాష్ట్రలో C-60, ఛత్తీస్‌గఢ్ స్పెషల్ ఫోర్సులకు ఇదే స్ఫూర్తి.
అలాంటి గ్రేహౌండ్స్ పూర్తిగా పక్కకు పెట్టడం అసాధ్యంగా భావించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంత పోరాటాల్లో గ్రేహౌండ్స్ శిక్షణ ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. కనుక.. ఇతర రాష్ట్రాల పోలీసులకు, అలాగే కొత్తగా రిక్రూట్ అయ్యే పోలీసులకు.. కమాండో ట్రైనింగ్ ఇచ్చే ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ గా ఇవి రూపాంతరం చెందే అవకాశముందని అంటున్నారు. దేశంలో ఎక్కడైనా స్పెషల్ ఆపరేషన్స్ కి అవసరమైనపుడు వీటిని వాడుకుంటారు.
ఉద్యమం నశించాక కనుమరుగయ్యే లేదా మార్పు చెందే ఇతర దళాలు ఏంటో చూస్తే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో.. ఇది మావోయిస్టు కదలికలను కనిపెట్టడానికి ఏర్పడిన ప్రత్యేక విభాగం. ఇకపై ఇది సైబర్ క్రైమ్, ఉగ్రవాదం, అంతర్గత భద్రత వైపు తన దృష్టి మళ్లిస్తుంది. అయితే ప్రతి జిల్లా పోలీస్ ఆఫీస్ లో ఉండే.. యాంటీ నక్సల్ సెల్స్, లేదా స్పెషల్ పార్టీలు క్రమంగా రద్దయ్యే అవకాశముంది. ఈ సిబ్బందిని లా అండ్ ఆర్డర్ లేదా క్రైమ్ ఇన్వెస్టిగేషన్లోకి మళ్లించవచ్చు. ఇక అడవికి ఆనుకుని ఉన్న గ్రామాల్లోని గ్రామ రక్షణ దళాలు, ఇన్ఫార్మర్ వ్యవస్థ కనుమరుగయ్యే అవకాశముంది. మావోయిస్టుల ముప్పు కారణంగా కొందరు లీడర్లకు అత్యంత భారీ భద్రతను ఇచ్చే జెడ్ కేటగిరి సెక్యూరిటీని ఇకపై తగ్గించవచ్చు. ప్రస్తుతం పెరుగుతున్న గంజాయి, సింథటిక్ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడానికి గ్రేహౌండ్స్ తరహా శిక్షణ ఉన్న వారు అవసరం. దీంతో వారిని ఈ విభాగాలకు పంపవచ్చు. సముద్ర తీరం ద్వారా జరిగే అక్రమ రవాణా అడ్డుకోవడం వంటి వాటికి కూడా ఈ దళాలను వినియోగించే అవకాశాలున్నాయి. ఇక సైబర్ వార్ ఫేర్ కి వీటిని షిఫ్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా నాడు ఎన్టీఆర్ హయాంలో ఆరంభమైన గ్రేహౌండ్స్ నేటి మావోయిస్టు ఉద్యమం నశించి పోవడానికి ప్రధానకారణాలలో ఒకటి అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఇప్పటి మావోయిస్టు పార్టీ దుస్థితికి ఎన్టీఆర్ జమానాలో పుట్టిన గ్రేహౌండ్స్ ది కీలక పాత్ర అనడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు.






