లొంగుబాటుకు, అరెస్టుకూ తేడా ఏంటి? దేవ్ జీ ప్రకటన ఆంతర్యం ఏంటి?
posted on: Mar 14, 2026 4:50PM
.webp)
మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ సరెండర్ అయ్యారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమా? ఆయన లొంగిపోలేదనీ, షెల్టర్ లో ఉండగా పోలీసులు అరెస్టు చేశారా? అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. ఈ సమాధానం కూడా మావోయిస్టు సానుభూతి పరుల నుంచో, ఇంకా లొంగిపోకుండా ఉద్యమ బాటలోనే ఉన్న మావోయిస్టుల నుంచో కాదు.. స్వయంగా దేవ్ జీ నుంచే రావడంతో.. ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టుల లొంగుబాట్లపై జరుగుతున్న ప్రచారంపైనే అనుమాన నీలి మేఘాలు కమ్ముకున్నాయి. దేవ్ జీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను ఆయుధాలను విసర్జించి లొంగిపోలేదనీ, పోలీసులే తనను అరెస్టు చేశారనీ వెల్లడించారు. షెల్టర్ లో తలదాచుకున్న సమయంలో పోలీసులు అరెస్టు చేయడంతో ఇక విధిలేక, అనివార్య పరిస్థితుల్లో అజ్ణాత జీవితానికి స్వస్తి చెప్పి బహిరంగంగా రావాల్సి వచ్చిందని చెప్పారు. దేవ్ జీ ప్రకటన ఒక్కసారిగా పెను సంచలనంగా మారింది. దేవ్ జీ మావోయిస్టు సిద్ధాంతానికి ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నానని కుండబద్దలు కొట్టారు. ప్రజల కోసం తన పోరాటాన్ని ఆపే ప్రశ్నే లేదని తేల్చి చెప్పడమే కాకుండా.. పోరాట పంథా అనివార్యంగా మార్చుకోవలసి వచ్చిందని పేర్కొన్నారు.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం మావోయిస్టు ఉద్యమంలో వచ్చిన మార్పులు, పోలీసుల వ్యూహాలు, మావోయిస్టు అగ్రనేతల్లో ఉద్యమం కొనసాగించడంపై ఏర్పడిన అభిప్రాయభేదాలు, ఆ భిన్నాభిప్రాయాలతో పార్టీ చీలక అంచుకు చేరడం కారణాలుగా అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మొత్తంగా దేవ్ జీ ఇంటర్వూలో మావోయిస్టుల పోరాట పంధా, ఉద్యమ కొనసాగింపులో ఎదురైన ఆటుపోట్లు, ద్రోహాలూ, త్యాగాలూ మారిన పోలీసు వ్యూహాలకు అనుగుణంగా పార్టీ ప్రతివ్యూహరచనలో వైఫల్యాలు అన్నీ ప్రస్తావించారు. సాయుధపోరాటం ద్వారానే రాజ్యాధికారం అన్న సిద్ధాంతానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెబుతున్న దేవ్ జీ అనివార్య పరిస్థితుల్లోనే అజ్ణాత జీవితానికి స్వస్తి పలికినట్లు చెప్పడం సహజంగానే ఆయన లొంగుబాటు లేదా అరెస్టు పోరాట వ్యూహంలో భాగమేనా అన్న అనుమానాలకు తావిస్తోంది. అన్నిటికీ మించి ఆయన అభిప్రాయాల ప్రకటన రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. అధికారపార్టీ బూటకపు లొంగుబాట్లకు తెరలేపిందంటూ ప్రతిపక్షాల విమర్శలకు తావిచ్చింది.
ఇక లొంగిపోయిన మావోల పునరావాసం, ప్రభుత్వ విధానం వంటి అంశాలపై విస్తృత చర్చకూ, విమర్శలూ, ప్రతి విమర్శలకూ దోహదం చేస్తుందన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద దేవ్ జీ ప్రకటన తెలంగాణ ప్రాంతంలో నక్సలిజంపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది. తెలంగాణ ప్రాంతంలో నక్సల్ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులు, మావోయిస్టు భావజాలం తదితర అంశాలు మరో సారి విస్తృత చర్చనీయాంశాలుగా మారాయి. అపరేషన్ కగార్ నుంచి మావోయిస్టులు అంతమైపోకుండా కాపాడుకునే వ్యూహంలో భాగంగానే లొంగుబాట్లు జరుగుతున్నాయా అన్న అనుమానాలను తెరమీదకు తెచ్చాయి.
జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు ప్రజలతో సంబంధాలను ఏర్పరుచుకుని పరిస్థితులు కుదుటపడగానే మళ్లీ ఉద్యమ బాట పడతారా.. ఈ సంధి కాలంలో తమ సిద్ధాంతాన్ని ప్రజలలో బలంగా నాటుకునేలా ప్రచారం చేయడానికి ఉపయోగించుకుంటారా? అన్న చర్చ మొదలైంది. లొంగిపోలేదు, అరెస్టయ్యాను అంటూ దేవ్ జీ చెప్పడం వెనుక అర్ధం అదేనా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా లొంగుబాట్ల తదననంతర పరిణామాలు సమాజంపై ఏ విధమైన ప్రభావం చూపుతాయన్నది రానున్న రోజులలో తెలుస్తుందని అంటున్నారు.


.webp)


