సెక్ష‌న్- 301 అంటే ఏంటి?.. ఇండియా, అమెరికా వాణిజ్య ఒప్పందాల్లో దీని పాత్ర ఏమిటి?

posted on: Jun 5, 2026 2:54PM

భారత్ కోరుతున్న సెక్ష‌న్- 310 ప్రొటెక్ష‌న్ అనేది అమెరికా తన 1974 ట్రేడ్ యాక్ట్ కింద.. విదేశీ వాణిజ్య పద్ధతులపై ఏకపక్షంగా దర్యాప్తు చేయ‌డం. అవసరమైతే అదనపు సుంకాలు లేదా ఇతర ప్రతీకార చర్యలు విధించే అధికారాన్ని క‌లిగి ఉండ‌టం. అయితే ఈ అమెరికా వాణిజ్య‌, రాజ‌కీయ భ‌ద్ర‌త‌ను త‌మ‌పై ప్ర‌యోగించ‌కుండా నిలువరించమని అడుగుతోంది భార‌త్.  అమెరికా విదేశాంగ ప్ర‌తినిథి కార్యాల‌యం.. 2026 మార్చి 10న భారత్ సహా 16 ఆర్థిక వ్యవస్థలపై సెక్ష‌న్- 301 దర్యాప్తులు ప్రారంభించినట్టు ప్రకటించింది. అందువల్ల ఇండియా కొత్త ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా.. దక్కే ట్యాక్స్ బెనిఫిట్స్ ను  ఈ దర్యాప్తులు క్షణాల్లో నిర్వీర్యం చేస్తాయ‌ని  క‌ల‌త చెందుతోంది. 

ఇంత‌కీ ఏమిటీ సెక్ష‌న్ 301 అంటే.. ఇది 1974 కి  చెందిన యూఎస్ ట్రేడ్ యాక్ట్. ఇది అమెరికా వాణిజ్య ప్ర‌తినిథి  కార్యాల‌యం, విదేశీ ప్ర‌భుత్వాల అన్ ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ ని విచారిస్తుంది. ఒక వేళ విదేశాలు అమెరికాతో చేసే అక్ర‌మ‌ వాణిజ్యం గానీ రుజువైతే.. టారీఫులు పెరుగుతాయి. కోటాలు త‌గ్గిపోతాయి. ఇక భారీ ఆంక్ష‌లు విధించే అవ‌కాశం సైతం ఉంటుంది. దీంతో పాటు.. ఆ ట్రేడ్ కాంటాక్ట్ ని కూడా  నిలిపేస్తుంది యూఎస్.
 
ఇది డబ్ల్యుటీవో  వివాద పరిష్కార వ్యవస్థలా రెండు పక్షాల మధ్య సాగే సుదీర్ఘ‌ న్యాయప్రక్రియపై ఆధారపడదు. అమెరికా తనే సొంతంగా దర్యాప్తు ప్రారంభించి, ఆపై తనే ఏక‌ప‌క్ష చ‌ర్య‌ల‌ను తీసుకుంటుంది. అందుకే సెక్ష‌న్- 301ను వాషింగ్టన్ అత్యంత కఠినమైన వాణిజ్య అమలు సాధనాల్లో ఒకటిగా భావిస్తుంది.
 
2026 మార్చిలో.. అమెరికా వాణిజ్య ప్ర‌తినిథి  కార్యాల‌యం ప్రారంభించిన దర్యాప్తుల్లో భారత్ కూడా ఉంది.  ఇతర దేశాలతో కలిసి అద‌న‌పు ఉత్పాద‌క  సామ‌ర్ధ్యంతో పాటు కొన్ని తయారీ రంగాలలో ప్రభుత్వ-సహాయ పోటీతత్వాన్ని పరిశీలిస్తోంది.
 
కొన్ని కథనాల ప్రకారం, భారత్, అమెరికా వాణిజ్య చర్చలు 2026 ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్నాయి.  కానీ అమెరికా భవిష్యత్తులో విధించగల సెక్ష‌న్- 301 టారీఫ్ ల మీద  ఒక‌ స్పష్టత లేకపోవడం వల్ల ఢిల్లీ అంగీకార ఒప్పందాన్ని ముగించడానికి జంకుతోంది. భారత్‌కు ఎదుర‌య్యే ముఖ్య‌మైన స‌మ‌స్య ఏంటంటే, అమెరికా ఒక చేతితో ఒప్పందం ద్వారా టారీఫ్ రిలీఫ్‌ ఇస్తూనే..  మరో చేత్తో  సెక్ష‌న్- 301 పేరిట‌ కొత్త సుంకాలు విధిస్తే ఆ ఒప్పందం అసలు విలువ కోల్పోతుంది. ఇదే భార‌త్ అస‌లు స‌మ‌స్య‌. సెక్ష‌న్- 301ను  1980లలో అమెరికా విస్తృతంగా వాడింది.  ఆ తరువాత ట్రంప్ మొదటి పాల‌నా కాలంలో చైనాపై టారీఫ్ ల‌ను పెంచ‌డం కోసం ఒక ఆయుధంగా వాడింది.
 
2026లో ట్రంప్ టారీఫుల్లోని కొంత భాగం కోర్టుల్లో నిలవ‌కపోవడంతో, వాషింగ్టన్ మరింత చట్టపరమైన బ్యాక‌ప్ టూల్స్ ని  ప‌రిశీలించింది. అందులో భాగంగా తిరిగి  తెర‌పైకి వ‌చ్చిందే ఈ సెక్ష‌న్  301. సెక్ష‌న్ 301 వెన‌కున్న బ్యాగ్రౌండ్ స్టోరీయే.. భారత్ ఆందోళనకు గ‌ల ప్ర‌ధాన‌ కారణం.  అమెరికా ఇప్పుడు అంత‌ర్జాతీయ వాణిజ్య నిబంధ‌న‌ల అమ‌లు చేస్తూ ఒక‌ర‌క‌మైన‌ దాడి చేస్తున్నప్పటికీ..  దాని ప్రభావం సాధారణ వాణిజ్య చర్చలకన్నా ఎక్కువగా ఉండేలా తెలుస్తోంది.
 
2026 ఫిబ్రవరి 6న అమెరికా, భారత్   స‌మ‌గ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద ప్ర‌క‌ట‌న చేశాయి. ఇది పూర్తి ద్వైపాక్షిక ఒప్పందం దిశగా తొలి బలమైన అడుగ‌ని ఒక‌ అంచ‌నా ఉంది. అయితే ఫిబ్రవరి 22–24 మధ్య, అమెరికా సుప్రీం కోర్టు ట్రంప్ టారీఫ్ విధానాల్లో కొన్ని భాగాలను రద్దు చేయడంతో, భారత్ త‌న‌ చర్చల వేగాన్ని త‌గ్గించింది.

2026 మార్చి 10–11న అమెరికా సెక్ష‌న్  301 ప్ర‌యోగించేందుకు ప‌లు చ‌ర్య‌ల‌ను మొద‌లు పెట్టింది. జూన్ 1న  భారత్ సెక్ష‌న్- 301 నుంచి విముక్తి కావాల‌ని కోరుతున్న‌ట్టు ప‌లు అంత‌ర్జాతీయ  క‌థ‌నాల ద్వారా తెలుస్తోంది. సెక్ష‌న్ 301 కింద యూఎస్ టీఆర్  ఒక అసంబంధంగా నిర్ధారిస్తే, అమెరికా డబ్ల్యుటీవో తీర్పు కోసం ఎదురు చూడకుండానే ప్రతిచర్యలు తీసుకోవచ్చు. ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ఒక అమెరికాకు ఏమంత క‌ష్ట‌ం  కూడా కాదు. చాలా  చాలా సాధార‌ణ చ‌ర్య‌ల ద్వారానే క‌ఠిన  నిర్ణ‌యాలు తీసుకోగ‌ల‌దు. ఈ విధానంలో అవ‌త‌లి ప‌క్షానికి ఎలాంటి వాద‌నా వినిపించే అవ‌కాశ‌ముండ‌దు. ఇదొక వ‌న్ వే. కేవ‌లం అమెరికా చేతుల్లో మాత్ర‌మే డెసిష‌న్ మేకింగ్ ప‌వ‌ర్ ఉంటుంది. అందుకే భారత్ టారీఫ్ క్లారిటీ కోరుతోంది. ఎందుకంటే ఇది చ‌ట్ట‌ప‌ర‌మైన ప్ర‌క్రియే అయినా దీని అడ్వాంటేజీ మొత్తం అమెరికాకి మాత్ర‌మే ల‌భిస్తుంది.

కొన్ని అంత‌ర్జాతీయ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. 2025లో అమెరికాతో భారత్ సుమారు 58 బిలియన్ డాల‌ర్ల మ‌ర్చండైస్ ట్రేడ్ స‌ర్ ప్ల‌స్ నమోదు చేసింది, అంటే ఒక దేశం యొక్క వస్తువుల ఎగుమతుల విలువ, దిగుమతుల విలువ కంటే, ఎక్కువగా ఉండటం అన్న‌మాట‌. ఇది భార‌త్ కి లాభ‌దాయ‌కం కాగా అమెరికాను రాజ‌కీయంగా  రెచ్చ‌గొట్టేలాంటి  అంశం. టెక్స్ట్ టైల్స్, ఆటో పార్ట్స్, స్టీల్, పెట్రో కెమిక‌ల్స్, కెమిక‌ల్స్, నిర్మాణ రంగ వ‌స్తువులు, హెల్త్ ప్రాడ‌క్ట్స్ ఇవి భారత ఎగుమతుల్లో ముఖ్య‌మైన‌వి. ఇవి దెబ్బతింటే, కేవలం కంపెనీల లాభాలే కాదు, ఉద్యోగాలు, రాష్ట్ర ఆదాయంతో పాటు స‌ప్లై చైన్ సైతం ఎఫెక్ట్ అవుతుంది.
 
ఈ వివాదంలోగ‌ల రెండు ముఖ్య‌మైన విష‌యాలు ఏంటంటే, అమెరికా అక్ర‌మ‌ వాణిజ్యాన్ని క‌ట్ట‌డి  చేయాల‌నుకోవ‌డం ఒక‌టి కాగా.. రెండోది భారత్ మాత్రం తన ఎగుమ‌తుల  పోటీత‌త్వం కాపాడుకోవాలనుకోవ‌డం.  భారత తయారీ రంగంలో మితిమీరిన ఉత్పాద‌క‌త‌, ప్రభుత్వ సహాయం, మార్కెట్ స‌మ‌తుల్య‌త  దెబ్బ తీసే విధానాలున్నాయని వాదిస్తున్నారు అమెరికా అధికారులు. భారత్ మాత్రం ఈ ఆరోపణలను తగిన ఆధారం లేని రాజకీయ ఒత్తిడిగా కొట్టి ప‌డేస్తోంది. ఇక్క‌డ అస‌లు విష‌యం ఏంటంటే..ఇది స్వచ్ఛమైన వాణిజ్య చర్చ కాదు.  ఇది అనుకూల‌త‌, స‌మ‌య‌పాల‌న‌, బేర‌సారాల‌ మీద నడుస్తున్న ఒకానొక మైండ్ గేమ్.  

సూటిగా చెప్పాలంటే, భారత్ అడుగుతున్నది  స్పెష‌ల్ ట్రీట్మెంట్ కాదు. ఒప్పందం కుదిరిన తర్వాత అమెరికా మరొక చట్టంతో దానిని చీల్చేయకుండా ముందే రక్షణ కావాలని కోరుతోంది. అమెరికా మాత్రం సెక్ష‌న్ 301ను తన వాణిజ్య విధాన విధానాన్ని ఎత్తి  చూపే సాధనంగా భావిస్తోంది. అంటే ఒప్పందం ఒక వైపు, బెదిరింపు మరో వైపు అన్న ద్వంద్వ వైఖ‌రి  ప్ర‌ద‌ర్శించ‌డం  అన్న‌మాట‌. ఇలాంటి పరిస్థితిలో.. భార‌త్ జాగ్రత్త పడటం సహజం. ఎందుకంటే టారీఫ్ రిలీఫ్ అన్న‌ది కాగితంపై మాత్రమే మిగిలిపోయే అవకాశం ఉన్నప్పుడు, వాస్తవ ప్రయోజనం ఏదీ క‌ల‌గ‌క పోవ‌చ్చు. కాబ‌ట్టి ఈ విష‌యంలో భార‌త్ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     

google-ad-img
    Related Sigment News
    • Loading...