రివర్స్ పేరెంటింగ్ అంటే ఏంటి?
posted on: Feb 27, 2026 12:14PM

వేగంగా మారుతున్న జీవనశైలి, డిజిటల్ యుగంలో పేరెంటింగ్ పద్ధతులు కూడా మారుతున్నాయి. అలాంటి ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు చాలా చర్చించబడుతోంది. అదే రివర్స్ పేరెంటింగ్. దీనిని చైనా వంటి దేశాల నుండి అమెరికా వరకు తల్లిదండ్రులు ఫాలో అవుతున్నారట. రివర్స్ పేరెంటింగ్ అనే పదం కొత్తగా అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం చాలా కుటుంబాలలో స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు పేరెంటింగ్ నిపుణులు. అసలు రివర్స్ పేరెంటింగ్ అంటే ఏమిటి? దీని వల్ల కుటుంబంలో మంచి జరుగుుతుందా? లేక చెడు జరుగుతుందా? పూర్తీగా తెలుసుకుంటే..
రివర్స్ పేరెంటింగ్ అంటే ఏమిటి?
సాధారణంగా పేరెంటింగ్ లో పిల్లలకు తల్లిదండ్రులు మార్గ నిర్దేశకత్వం చేస్తుంటారు. కానీ రివర్స్ పేరెంటింగ్ లో ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేస్తాడు. పిల్లలు తల్లిదండ్రులకు అన్నీ వివరిస్తారు. లేదా నిర్ణయం తీసుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. ఇందులో రెండు విధాలు ఉన్నాయట..
ఎమోషనల్ క్యారెక్టర్స్ చేంజ్..
పిల్లవాడు తల్లిదండ్రుల ఎమోషనల్ కేరింగ్ ను తాను తీసుకుంటాడు. ఇది ఎమోషనల్ క్యారెక్టర్స్ చేంజ్ అని పిలవబడుతోంది.
డిజిటల్ లేదా లైఫ్ స్టైల్ మార్గదర్శకత్వం..
పిల్లవాడు తల్లిదండ్రులకు టెక్నాలజీ, సోషల్ మీడియా, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మొదలైన వాటి గురించి నేర్పించడం జరుగుతుంది. దీన్ని డిజిటల్ లేదా లైఫ్ స్టైల్ మార్గదర్శకత్వం అని అంటున్నారు.
రివర్స్ పేరెంటింగ్ లో..
పిల్లవాడు తల్లిదండ్రుల మధ్య గొడవలను పరిష్కరిస్తాడు. ఆర్థిక నిర్ణయాలపై తన సలహా ఇస్తుంటాడు. డిజిటల్ ప్రపంచం నేటి పిల్లలకు బాగా పరిచయం. కానీ తల్లిదండ్రులకు డిజిటల్ ప్రపంచం పరిచయం ఉండకపోవచ్చు. అలాంటి వారికి పిల్లలు అర్థమయ్యేలా చెబుతారు.
రివర్స్ పెరెంటింగ్ లో పిల్లలు వారి బాధ్యతను సమతుల్యంగా ఉండేలా చూసుకుంటే అది బానే ఉంటుంది. కానీ పిల్లలు తమ బాల్యాన్ని పణంగా పెట్టి రివర్స్ పేరెంటింగ్ లో మాత్రమే నిండిపోతే అది వారికి, వారి భవిష్యత్తుకు సమస్యగా మారుతుందని పేరెంటింగ్ నిపుణులు చెబుతున్నారు.
రివర్స్ పేరెంటింగ్ ప్రయోజనాలు..
బాధ్యత..
పిల్లలు పెద్దల పాత్రను పోషించినప్పుడు లేదా బాధ్యతలను స్వీకరించినప్పుడు వారు త్వరగా పరిణతి చెందుతారు.
బలమైన భావోద్వేగ బంధం..
ఒకరి బాధ్యతలను ఒకరు అర్థం చేసుకోవడం వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య అవగాహన పెరుగుతుంది.
డిజిటల్ అంతరాన్ని తగ్గించడం..
పిల్లలు టెక్నాలజీని సులువుగా నేర్చుకుంటారు, వారి కుటుంబంలో కూడా వాటిని నేర్పడం వల్ల పిల్లలు తల్లిదండ్రులతో డిజిటల్‌గా కనెక్ట్ అవ్వగలుగుతారు. ఇది అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
రివర్స్ పేరెంటింగ్ నష్టాలు..
చిన్న వయసులోనే అధిక బాధ్యత పిల్లలలో ఒత్తిడిని పెంచుతుంది.
బాల్యం కోల్పోవడం
ఆటలాడే వయసులో బాధ్యతలు స్వీకరించడం భావోద్వేగ వికాసాన్ని ప్రభావితం చేస్తుంది.
పాత్ర గందరగోళం
బాధ్యత, హోదాలో మార్పులు కుటుంబంలో అధికారం, బాధ్యత యొక్క సరిహద్దులను అస్పష్టం చేస్తాయి.
*రూపశ్రీ





