30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే కలిగే లాభనష్టాలు ఇవే..!
posted on Nov 24, 2025 11:23AM

వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, బాధ్యతలు, అవగాహనతో కూడిన సంబంధం. ఈ రోజుల్లో చాలా మంది కెరీర్, చదువులు లేదా వ్యక్తిగతంగా ఎదగాలి అనే కారణంగా ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. బాగా గమనిస్తే చాలా వరకు వివాహాలు 30 ఏళ్లు దాటిన వాళ్లవే ఎక్కువగా ఉంటున్నాయి. 30 ఏళ్ల తర్వాత వివాహం చేసుకునే ధోరణి ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. అయితే ప్రతి పనికి లాభ నష్టాలు ఉన్నట్టే.. 30 ఏళ్ల తర్వాత వివాహం చేసుకోవడం అనే విషయంలో కూడా లాభనష్టాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుంటే.. 30 ఏళ్ల లోపు వివాహం చేసుకోవడం మంచిదా? లేక 30 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటే మంచిదా? అనే విషయం మీద ఒక క్లారిటీ వస్తుంది. దీని గురించి తెలుసుకుంటే..
30 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..
30 సంవత్సరాల వయస్సులో చాలా మంది కెరీర్‌లో సెటిల్ అయి ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం లేదా పొదుపు ఇలా చాలా కారణాలుగా వివాహం తర్వాత ఆర్థిక అభద్రత తక్కువగా ఉంటుంది. భాగస్వామి పోషణ కూడా కష్టంగా అనిపించదు. 24-25 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకోవడంతో పోలిస్తే.. 30 ఏళ్ల తర్వాత చేసుకునే వివాహంలో ఆర్థిక భద్రత ఉంటుంది.
మానసిక పరిపక్వత, అవగాహన..
చిన్న వయస్సులో తీసుకునే నిర్ణయాలు తరచుగా తొందరపాటుతో ఉంటాయి. కానీ 30 సంవత్సరాల తర్వాత చాలా వరకు పరిణతి చెందుతారు. సంబంధాల గురించి మంచి అవగాహన ఉంటుంది. ఈ పరిపక్వత వివాహాన్ని బలంగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
వ్యక్తిగత వృద్ధి, ఇండిపెండెన్స్..
30 ఏళ్లలోపు వారు చదువులు, కెరీర్, ప్రయాణాలు, అభిరుచులు మొదలైన వాటిలో బిజీగా ఉంటారు. కానీ 30 ఏళ్ల తర్వాత వివాహం చేసుకునే వారు వైవాహిక బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది.
ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం..
30ఏళ్ళ తర్వాత చాలా వరకు పరిణితి పొంది ఉంటారు. వీరు తమ ప్రాధాన్యతలను బాగా అర్థం చేసుకుంటారు. జీవితంలో ఏమి కోరుకుంటున్నారో, వారి కుటుంబం, వృత్తిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో వారికి తెలుసి ఉంటుంది.
డబ్బును సరిగ్గా ఉపయోగించడం..
30 సంవత్సరాల తర్వాత చాలామందికి డబ్బు గురించి మంచి అవగాహన వచ్చి ఉంటుంది. దీని వల్ల డబ్బును ప్లానింగ్ గా ఖర్చు పెట్టడం తెలిసి ఉంటుంది.
30 ఏళ్ల తర్వాత వివాహం చేసుకోవడం వల్ల కలిగే నష్టాలు..
గర్భధారణలో సమస్యలు
మహిళలకు 30 తర్వాత సంతానోత్పత్తి క్రమంగా తగ్గుతుంది. 35 తర్వాత గర్భధారణలో ఇబ్బందులు, సమస్యలు వచ్చే అవకాశాలు పెరగవచ్చు. వయస్సుతో పాటు అండాల నాణ్యత తగ్గుతుంది. ఇది గర్భధారణలో సమస్యలను కలిగిస్తుంది. పురుషులకు వయస్సుతో పాటు స్పెర్మ్ నాణ్యత కూడా ప్రభావితమవుతుంది. ఇది గర్భధారణను ఆలస్యం చేస్తుంది. పెరుగుతున్న వయస్సుతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. ఇది ఆరోగ్యకరమైన వివాహ జీవితాన్ని గడపడం కష్టతరం చేస్తుంది.
సామాజిక ఒత్తిడి, అంచనాలు..
30 సంవత్సరాల తరువాత వివాహం విషయంలో కుటుంబం, సమాజం నుండి ఒత్తిడి ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. కొన్ని సార్లు ఒత్తిడి కారణంగా తొందరపాటులో పెళ్లికి ఒప్పుకోవడం, ఆ తరువాత నష్టాన్ని చూడటం జరుగుతుంది.
సంబంధాలలో సర్దుబాటు కష్టం..
30 సంవత్సరాల తరువాత వ్యక్తి యొక్క ఆలోచనలు, అలవాట్లు, జీవనశైలి చాలా స్థిరంగా మారతాయి. దీని కారణంగా కొత్త వ్యక్తితో సర్దుబాటు చేసుకోవడం కష్టం కావచ్చు. అలవాట్లు మార్చుకోవడానికి వీరు అంత తొందరగా అంగీకరించరు. దీని వల్ల విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు.
పిల్లలను పెంచడం..
30 ఏళ్ళ తర్వాత పిల్లలు ఆలస్యంగా జన్మిస్తే పిల్లలు పెరిగే సమయానికి తల్లిదండ్రులు పెద్దవారవుతారు. ఇది పిల్లలను పెంచడంలో, వారి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయడంలో సవాళ్లకు దారితీయవచ్చు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య పెద్ద తరం అంతరం పరస్పర అవగాహన, బంధంలో ఇబ్బందులకు దారితీస్తుంది.
ఆర్థిక ఒత్తిడి, భవిష్యత్తు ప్రణాళిక..
30 సంవత్సరాల తర్వాత ఉద్యోగ భాద్యతలు, ఆర్థిక బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ఇది వివాహం తర్వాత కొత్త బాధ్యతలను నెరవేర్చడం సవాలుగా చేస్తుంది. వివాహం తర్వాత జీవితంలో ఆర్థిక ప్రణాళికలను మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది. పెద్ద వయస్సులో వివాహం చేసుకున్న తర్వాత, దంపతులు ఒకరితో ఒకరు సమయం గడపడం కంటే కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలోనే ఎక్కువ సమయం గడిచిపోతుంది.
*రూపశ్రీ.