Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వాహ్ క్యాసీన్ హై.. ఏపీ, తెలంగాణల్లో చూడగలమా?
posted on: May 12, 2026 10:44AM

తమిళనాడులో సోమవారం (మే 11) రాజకీయ విలువలకు అద్దంపట్టే చూడముచ్చటైన దృశ్యం ఆవిష్కృతమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ స్వయంగా రాష్ట్ర మాజీ సీఎం స్టాలిన్ నివాసానికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సందర్భంగా స్టాలిన్ విజయ్ ను ఆప్యాయంగా హత్తుకున్నారు. అంతకు కొద్ది క్షణాల ముందు.. తమ నివాసానికి వచ్చిన విజయ్ కు తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టాలిన్ కుమారుడు ఉదయనిథి మారన్ ఆప్యాయంగా పలకరించి, అలింగనం చేసుకుని లోనికి తోడ్కొని వెళ్లారు.
ఇటీవలి కాలంలో రాజకీయ ప్రత్యర్థులు అంటే బద్ధ శత్రువుల్లా వ్యవహరించే తీరు ఎక్కువైపోయింది. అంశాల వారీ విమర్శలు అన్న విషయాన్ని పక్కన పెట్టేసి ప్రత్యర్థి పార్టీలు పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేసుకునే స్థాయికి దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో విమర్శల స్థాయి పాతాళానికి దిగజారిపోయిన పరిస్థితి ఉంది. అయితే గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. పరిణతితో, సామాజిక బాధ్యతతో ఉండేది. ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య రాజకీయ విభేదాలు, సైద్ధాంతిక ఎంపికలు ఉన్నప్పటికీ పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకునే పరిస్థితి ఉండేది. అయితే తరువాత తరువాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
అయితే.. తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో సైద్ధాంతిక విభేదాలు వ్యక్తిగత విభేదాలుగా మారిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో విజయ్ చేసిన పని ప్రజాస్వామ్య వాదుల మన్ననలు అందుకుంటోంది. ఇటువంటి పరిస్థితి గతంలో ఉండేదని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు చేసే నేతలు.. ఆ తర్వాత రాజకీయాలను పక్కనపెట్టేసి అభివృద్ధిపై దృష్టి సారించేవారంటున్నారు. రాజకీయాల్లో పరస్పరం చేసుకున్న విమర్శలను ఆ తర్వాత వారు అంతగా పట్టించుకునే వారు కాదు.అసలు గతంలో రాజకీయ విమర్శలు కూడా హుందాగా, సిద్ధాంతాల ప్రాతిపదికనే ఉండేవి.
అయితే నేడు అది కనుమరుగై.. విమర్శలు అంటే వ్యక్తిగత దూషణలే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అయితే తమిళనాడు సీఎం విజయ్ స్వయంగా మాజీ సీఎం ఇంటికి వెళ్లడం ద్వారా రాజకీయాలలో విలువలకే పెద్దపీట వేస్తానని చాటారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన శైలి భిన్నంగానే ఉంది. ప్రత్యర్థి పార్టీలపై పెద్దగా విమర్శలు చేయలేదు. ఒక వేళ చేసినా అవి ఎక్కడా పరిధి దాటలేదు. ఆరోగ్యకరమైన రాజకీయాలకు విజయ్ తమిళనాట తెరతీశారని పరిశీలకులు అంటున్నారు.






