రేర్ ఎర్త్ మినరల్స్ సంక్షోభం వేళ భారత్ వైపు వెస్ట్రన్ బ్లాక్ చూపు!

posted on: May 25, 2026 1:17PM

డెడ్ ఎకానమీ నుంచి తప్పించుకోలేని అవసరం

చైనా చేతిలో అమెరికా సాంకేతిక గొంతు – ఇండియా వైపు మలుపు

ప్రపంచ ఆర్థిక, రాజకీయ ముఖచిత్రంలో అగ్రరాజ్యం అమెరికా అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. ఒకప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను తక్కువగా అంచనా వేస్తూ.. అంతర్జాతీయ వేదికలపై విమర్శలు గుప్పించిన పాశ్చాత్య దేశాలు, ఇప్పుడు అదే భారత్ సహాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రత్వాలు ఉండవని, కేవలం ప్రయోజనాలు మాత్రమే పరమావధి అనే సూత్రం మరోసారి రుజువైంది.  చైనా తీసుకున్న ఒకే ఒక్క కఠిన నిర్ణయం అమెరికా రక్షణ, సాంకేతిక రంగాల గొంతును నొక్కేయడంతో, వాషింగ్టన్ ఇప్పుడు తన వ్యూహాత్మక లోపాలను సవరించుకోవడానికి న్యూఢిల్లీ వైపు పరుగులు తీస్తోంది.  గత కొంతకాలంగా అమెరికా, చైనాల మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యంత్రాంగం చైనా దిగుమతులపై ఏకంగా 200 శాతం భారీ టారిఫ్ లు విధించి బీజింగ్ ను లొంగదీసుకోవాలని ప్రయత్నించింది. అయితే, చైనా ఈ బెదిరింపులకు వెరవకుండా మరింత శక్తిమంతమైన ప్రతిఘటనకు దిగింది. 

ప్రపంచవ్యాప్తంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి కీలకమైన  రేర్ ఎర్త్ మినరల్స్ (అరుదైన ఖనిజాలు) ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. తమ ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక్క కిలో ఖనిజాన్ని కూడా వెలుపలికి పంపేది లేదంటూ చైనా జారీ చేసిన ఉత్తర్వులు అమెరికా టెక్నాలజీ రంగానికి కోలుకోలేని దెబ్బగా మారాయి.  ఈ అరుదైన ఖనిజాల లభ్యత, ప్రాసెసింగ్ లో  చైనాకు ఉన్న ఏకఛత్రాధిపత్యమే దానికి ఇంతటి బలాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న రేర్ ఎర్త్ మినరల్స్ లో దాదాపు 70 శాతం వాటా చైనాదే కాగా, వాటిని శుద్ధి చేసే ప్రాసెసింగ్ ప్లాంట్లలో ఏకంగా 90 శాతం చైనా అధీనంలోనే ఉన్నాయి. ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్న టెస్లా విద్యుత్ వాహనాలు, ఆపిల్ ఐఫోన్లు, ఎన్విడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ తో పాటు అమెరికా వైమానిక దళానికి గుండెకాయ లాంటి ఎఫ్-35 ఫైటర్ జెట్లు, అత్యాధునిక క్షిపణి వ్యవస్థల తయారీకి ఈ ఖనిజాలే అత్యంత కీలకం. 

చైనా విధించిన ఎగుమతుల నిషేధంతో ఈ కీలక ఉత్పత్తుల  సప్లై చైన్  పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది.  ఈ సంక్షోభం నేపథ్యంలోనే  క్వాడ్  కూటమి అకస్మాత్తుగా అత్యంత చురుగ్గా మారింది. చైనాకు ప్రత్యామ్నాయంగా ఒక సురక్షితమైన, నమ్మకమైన అంతర్జాతీయ సప్లై చైన్ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. ఈ కొత్త కూటమి వ్యూహం ప్రకారం.. ఆస్ట్రేలియా తన దేశంలో ఉన్న గనుల నుండి రేర్ ఎర్త్ ఖనిజాలను వెలికితీస్తుంది. జపాన్ అందుకు అవసరమైన హై-ఎండ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని, యంత్రాలను సమకూరుస్తుంది. అమెరికా భారీ ఎత్తున పెట్టుబడులను  అందిస్తుంది. కానీ, ఈ మొత్తం ప్రక్రియ విజయవంతం కావాలంటే అత్యంత కీలకమైన భారీ స్థాయి ప్రాసెసింగ్ సామర్థ్యం, మానవ వనరులు కేవలం ఇండియా వద్ద మాత్రమే ఉన్నాయి.  భారతదేశానికి ఉన్న వినూత్న పారిశ్రామిక శక్తి, ఇంజనీరింగ్ నైపుణ్యాలు, విస్తారమైన కార్మిక శక్తి,  ప్రాసెసింగ్ యూనిట్లే ఈ కొత్త గ్లోబల్ సప్లై చైన్ కు వెన్నెముకగా నిలుస్తున్నాయి. గతంలో అమెరికా అనుసరించిన ఏకపక్ష రాజకీయ విధానాలు, ముఖ్యంగా పాకిస్తాన్ వైపు మొగ్గు చూపడం, భారత్ పై అనవసర టారిఫ్ల ఒత్తిడి తీసుకురావడం, డెడ్ ఎకానమీ అంటూ హేళన చేయడం వంటి చర్యలు బూమరాంగ్ అయ్యాయని వాషింగ్టన్ ఇప్పుడు గ్రహించింది. 

చైనాను అంతర్జాతీయంగా నిరోధించాలన్నా, సమతుల్యత సాధించాలన్నా ఆండియాతో  భాగంగానే అమెరికా ఉన్నతాధికారి మార్కో రూబియో అత్యంత ప్రాధాన్యతతో కూడిన భారత పర్యటనకు వచ్చారు. ఇది సాధారణ ద్వైపాక్షిక చర్చల పర్యటన మాత్రమే కాదు.. గతంలో భారతదేశ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసామనే పాశ్చాత్య దేశాల నిశ్శబ్ద అంగీకారానికి కూడా నిదర్శనం. డబ్బు,  సైనిక శక్తి ఉన్నప్పటికీ, కేవలం సంపదతోనే ప్రపంచ సరఫరా గొలుసును నియంత్రించలేమనే పచ్చి నిజాన్ని అమెరికా ఈ సంక్షోభం ద్వారా  తెలుసుకుంది.  భవిష్యత్తులో ఈ క్వాడ్ భాగస్వామ్యం మరింత బలోపేతం కానుంది. ఆస్ట్రేలియా గనుల నుండి వచ్చే ముడి ఖనిజాలు ఇండియా ఫ్యాక్టరీలలో శుద్ధి అయ్యి, జపాన్ సాంకేతికతతో, అమెరికా మార్కెట్లకు చేరేలా ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధమవుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చైనా   ఏకస్వామ్యానికి అడ్డుకట్ట పడటమే కాకుండా.. రక్షణ,  పారిశ్రామిక రంగాలలో భారత్ ఒక తిరుగులేని గ్లోబల్ హబ్ గా అవతరించేందుకు మార్గం సుగమం అవుతుంది.  

అంతర్జాతీయ సమాజం ఇప్పుడు భారతదేశాన్ని కేవలం ఒక పెద్ద వినియోగదారుల మార్కెట్ గా  మాత్రమే చూడటం లేదు. ప్రపంచ జియోపొలిటికల్ బ్యాలెన్స్ ను శాసించే శక్తిగా, పారిశ్రామిక, ప్రాసెసింగ్ పవర్ హౌస్ గా ఇండియా  స్థానం సుస్థిరమైంది. నిన్నటివరకు విమర్శలు గుప్పించిన ప్రపంచ సూపర్ పవర్స్ అన్నీ నేడు భారతదేశం వైపు ఆశగా చూడటమే ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయాల్లో అతిపెద్ద మార్పుగా చెప్పవచ్చు.  

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.   

google-ad-img
    Related Sigment News
    • Loading...