గుర్తించు- తొలిగించు- బ‌హిష్క‌రించు!

posted on: May 25, 2026 12:41PM

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సరిహద్దు భద్రత, జాతీయ భద్రతా అంశాల్లో ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులను రాష్ట్రం నుంచి పూర్తిగా నిర్మూలించేందుకు.. గుర్తించండి- తొలగించండి- బహిష్కరించండి.. అనే త్రిముఖ వ్యూహాన్ని  ప్రకటించారు  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి   సువేందు అధికారి. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు భద్రతా సమస్యలను పరిష్కరిస్తూ.. రాష్ట్రంలోని జనాభా సమతుల్యతను కాపాడటమే ధ్యేయంగా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ఈ విధానం పూర్తిగా జాతీయ భద్రత, పౌరసత్వ సవరణ చట్టం- సీఏఏ నిబంధనలకు అనుగుణంగా సాగనుంది. దీని ప్రధాన ఉద్దేశం  రాష్ట్రంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించి, చట్టపరమైన ప్రక్రియ ద్వారా వారిని తిరిగి పంపడమే.

గుర్తింపు..  అంటే నకిలీ పత్రాలు, అక్రమ నివాసాలను క్షేత్రస్థాయిలో గుర్తించడం, తొలగింపు.. అంటే ధృవీకరణ పూర్తయ్యాక, ఓటర్ల జాబితా, ప్రభుత్వ రికార్డుల నుంచి వారి పేర్లను తొలగించడం. ఇక‌ బహిష్కరించ‌ు..  అంటే- చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ సహకారంతో వారిని తిరిగి వారి దేశానికి పంపడం. ఈ చొరబాటు వ్యతిరేక చర్యలు కేవలం అక్రమ వలసదారులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయి. హిందూ శరణార్థులు-  సీఏఏ కింద పౌరసత్వానికి అర్హులైన వ్యక్తులకు ఈ విధానం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. 

సరిహద్దు నిర్వహణలో భాగంగా..  ఇండో, బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి 27 కిలోమీటర్ల మేర ముళ్లకంచె నిర్మించడానికి.. 75 ఎకరాల భూమిని అధికారికంగా బీఎస్ఎఫ్ కు  అప్పగించింది  రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వాల హయాంలో.. ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో సరిహద్దులు అభేద్యంగా మారాయని, ఇప్పుడా లోపాన్ని సరిదిద్దుతున్నామని చెబుతోంది సువేందు సర్కార్. ఈ కంచె నిర్మాణం ద్వారా అక్రమ చొరబాట్లు,  స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లకు పూర్తిగా అడ్డుకట్ట పడనుంది.

బెంగాల్ సీఎం సువేందు అధికారి చెప్పిన‌ట్టు.. పశ్చిమ బెంగాల్‌లో సీఏఏను  నిజమైన అర్థంలో అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. అక్రమ చొరబాటుదారులను, అర్హులైన శరణార్థులను వేరు చేసి చూడటంలో ప్రభుత్వం రాజీపడటం లేదు. నకిలీ పత్రాల నెట్‌వర్క్‌లు, మధ్యవర్తులపై ఉక్కుపాదం మోపుతూ..  పారదర్శకమైన పౌరసత్వ ప్రక్రియను చేపడుతున్నామని వెల్లడించింది సువేందు అధికారి సర్కార్. 

పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో మారుతున్న జనాభా గణాంకాలు జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ నివాసాలు, నకిలీ పౌరసత్వ పత్రాల తయారీ ఒక పెద్ద నెట్‌వర్క్‌గా మారాయి. వీటన్నింటిని అరికట్టడం ద్వారా, రాష్ట్రాన్ని భద్రపరచడమే కాకుండా, సరిహద్దుల వద్ద శాంతిని, పౌరుల రక్షణను నిర్ధారించాలని భావిస్తోంది ప్రభుత్వం.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...