పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. భద్రతా రాజకీయాలు!

posted on: Apr 27, 2026 2:19PM

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ  ఇప్పుడు ఒక రాజకీయ ప్రక్రియగా మాత్రమే కాకుండా..  దేశ భద్రతా ముఖచిత్రంలో ఒక కీలక ఘట్టంగా మారుతోంది. మునుపెన్నడూ లేని విధంగా భారత ఎన్నికల చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రాష్ట్రంలో మోహరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.  రాష్ట్రంలో  రెండు విడతల పోలింగ్ కోసం ఏకంగా 2.4 లక్షల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించడం వెనుక కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం ఒక బలమైన వ్యూహాత్మక సంకేతాన్ని పంపిస్తున్నాయి.

ఈ భారీ మోహరింపు వివరాలను పరిశీలిస్తే.. సుమారు 2,400 కంపెనీల కేంద్ర బలగాలు బెంగాల్ వ్యాప్తంగా పహారా కాశాయి. గతంలో జరిగిన పోలింగ్ అనంతర హింసాత్మక ఘటనలు, ఓటర్లలో ఉన్న భయాందోళనలు, న్యాయవ్యవస్థపై జరిగిన దాడుల ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈ బలగాలు వెంటనే వెనుదిరగకుండా, సుమారు 700 కంపెనీలు ఈవీఎంల భద్రత,  శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రంలోనే కొనసాగుతున్నాయి. 

బెంగాల్ రాజకీయాల్లో  హింస  అనేది ఒక దీర్ఘకాలిక సమస్యగా వేళ్లూనుకుంది. గతంలో వామపక్షాల పాలన నుండి ప్రస్తుత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఎన్నికల సమయంలో దాడులు, బెదిరింపులు నిత్యకృత్యమయ్యాయి. ముఖ్యంగా 2021 ఎన్నికల తదనంతర హింసపై జాతీయ స్థాయిలో జరిగిన విచారణలు, ప్రస్తుత మాల్దా ఘటనలపై సుప్రీంకోర్టు జోక్యం,  జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)  దర్యాప్తు వంటివి రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాల ఉనికి ఓటర్లకు భరోసా కల్పించే ప్రయత్నంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అయితే, ఈ ఎన్నికల భద్రత వెనుక ఉన్న మరో అతిపెద్ద కోణం  సిలిగురి కారిడార్  లేదా  చికెన్ నెక్  రక్షణ. కేవలం 20 నుండి 22 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ భూభాగం భారతదేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ఏకైక కీలక మార్గం. ఇక్కడి రోడ్లు, రైల్వేలు మరియు ఇంధన పైప్‌లైన్లు దేశ రక్షణ వ్యవస్థకు లైఫ్ లైన్ లాంటివి. బెంగాల్‌లో అంతర్గత అస్థిరత ఏర్పడితే, అది నేరుగా ఈ వ్యూహాత్మక కారిడార్ భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందనేది భద్రతా నిపుణుల విశ్లేషణ. దీనికి తోడు బంగ్లాదేశ్‌తో ఉన్న సుమారు రెండువేలరెండువందల కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు ప్రాంతం కూడా అత్యంత సున్నితమైనది. సరిహద్దుల గుండా జరుగుతున్న అక్రమ వలసలు, స్మగ్లింగ్,  కొన్ని తీవ్రవాద సంస్థల కార్యకలాపాలు జాతీయ భద్రతకు సవాలుగా మారాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరచుగా ప్రస్తావిస్తున్న జీరో టాలరెన్స్ విధానం, శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామనే హెచ్చరికలు బెంగాల్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న దృఢ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం బెంగాల్‌లో ఒకవైపు రాజకీయ ఆధిపత్య పోరు  మరోవైపు ఇది ప్రజాస్వామ్య,  రాజ్యాంగ విలువల మధ్య జరుగుతున్న సంఘర్షణగా కనిపిస్తోంది. 

కేంద్రం పంపుతున్న బలగాలు కేవలం ఎన్నికల నిర్వహణకే పరిమితం కాకుండా, ఒక నూతన భద్రతా నమూనాను   రూపొందించే దిశగా అడుగులు వేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల మధ్య నడుస్తున్న ఈ  నారేటివ్ యుద్ధం చివరికి ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో బెంగాల్ ఎన్నికల ఫలితాలు కేవలం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది మాత్రమే కాకుండా..  ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు,  జాతీయ భద్రతా ప్రయోజనాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా నిర్ణయించనున్నాయి. హింసను అరికడుతూనే ప్రజాస్వామ్య హక్కులను కాపాడటం..  సరిహద్దు భద్రతను పటిష్టం చేస్తూనే రాజ్యాంగ విలువలను గౌరవించడం ఇప్పుడు అసలైన సవాలుగా నిలుస్తోంది.

-సీతారాం కంఠంనేని

google-ad-img
    Related Sigment News
    • Loading...