అత్యాచార నిందితులకు మరణశిక్ష… కానీ

posted on: Jan 30, 2016 3:35PM

పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన ‘కామ్‌దుని’ అత్యాచార సంఘటనలో న్యాయస్థానం ముగ్గురికి మరణశిక్షను విధించింది. ఈ నేరంలో భాగస్వామ్యులుగా ఉన్న మరో ముగ్గురికీ యావజ్జీవ కారాగారశిక్షను నిర్దేశించింది. 2013సంవత్సరం జులై నెలలో జరిగిన ఈ సంఘటనలో ‘కామ్‌దుని’ అనే గ్రామానికి చెందిన ఒక కాలేజి విద్యార్థిని మీద తొమ్మది మంది వ్యక్తులు అత్యాచారం చేసి చంపేశారు. బాధితురాలిని హింసించి, ఆమె శరీరాన్ని చీల్చి ఒక చేపల చెరువులో పారేసి చేతులు దులుపుకున్నారు నిందితులు. నిందితులలో కొందరు అధికార పార్టీ అయిన తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందినవారు కావడంతో పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే కామ్‌దుని గ్రామస్తులు తమ గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రిని సైతం న్యాయం కోసం నిలదీయడంతో, పోలీసులు కేసు పురోగతిని వేగవంతం చేయక తప్పలేదు. ఇదిలా ఉంటే కామ్‌దుని తీర్పుని అటు ప్రతిపక్షం ఇటు ప్రభుత్వం తమకి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తమ ప్రభుత్వం న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందన్నదానికి ఈ తీర్పు ఒక ఉదాహరణ అని ప్రభుత్వం చెబుతుండగా… రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు ‘కామ్‌దుని’ ఘటన ఒక సాక్ష్యం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు న్యాయస్థానం దొషులకు కఠిన శిక్ష విధించినా, అది కామ్‌దుని ప్రజలను అంతగా తృప్తి పరచడం లేదు. తొమ్మిదిమంది నిందితులలో ముగ్గురిని వదిలేయడం ఇందుకు మొదటి కారణం కాగా, ఉన్నత న్యాయస్థానంలో ఈ తీర్పు ఎంతవరకు నిలుస్తుందన్న భయం మరో కారణం!

google-ad-img
    Related Sigment News
    • Loading...