ఇంధన రంగంలో పటిష్టంగా ఉన్నాం.. మన్ కీ బాత్ లో మోడీ

posted on: Mar 29, 2026 10:21PM

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియాలో చమురు సంక్షోభంపై వెల్లువెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ..  దేశం ఇంధన రంగంలో పటిష్టంగా ఉందని  క్లారిటీ ఇచ్చారు. ఆదివారం (మార్చి 29) మన్ కీబాత్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ప్రపంచ సవాళ్లను ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని స్పష్టం చేశారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇంధన కొరతపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు.

పశ్చిమాసియాలో   అనిశ్చితి, యుద్ధ వాతావరణం వల్ల చమురు సరఫరా చెయిన్ కు ఇబ్బందులు ఎదురౌతున్న సంగతి వాస్తవమే అన్నారు.  హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు కలుగుతున్న అంతరాయం   అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపుతోందని ప్రధాని అన్నారు. అయితే, ఈ క్లిష్ట సమయంలో 140 కోట్ల మంది భారతీయులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భద్రతను, ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసేలా వదంతులు వ్యాప్తి చేయవద్దన్నారు. 

గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోటి మందికి పైగా భారతీయుల క్షేమం పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్న ప్రధాని ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు సౌదీ అరేబియా, యూఏఈ,  ఇజ్రాయెల్ దేశాధినేతలతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. సంక్షోభ సమయంలో భారతీయులకు అండగా నిలుస్తున్న గల్ఫ్ దేశాలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

అంతర్గతంగా ఇంధన భారాన్ని తగ్గించేందుకు ఎక్సైజ్ సుంకాల తగ్గింపుతో పాటు, పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) మౌలిక సదుపాయాలను దేశవ్యాప్తంగా వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. ఇది వినియోగదారులకు ఊరటనివ్వడమే కాకుండా దీర్ఘకాలికంగా ఇంధన లభ్యతను సులభతరం చేస్తుందని మోడీ చెప్పారు. రాబోయే రోజుల్లో దేశం మరింత స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేయాలని ప్రధాని ఆకాంక్షించారు. ముఖ్యంగా జల సంరక్షణలో భాగంగా నిర్మించిన అమృత్ సరోవర్‌ల మాదిరిగానే, ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని, ఐక్యతతోనే ఏ సంక్షోభాన్ని అయినా అధిగమించగలమని ఆయన పునరుద్ఘాటించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...