నీరు, నెత్తురు క‌ల‌సి ప్ర‌వ‌హించ‌వు! సింధూ జ‌లాల ఒప్పందంలో కీల‌కం ఏంటంటే?

posted on: May 23, 2026 12:44PM

భారత్, పాకిస్థాన్ సంబంధాల్లో  అత్యంత స్థిరమైన ఒప్పందంగా పరిగణించబడిన సింధు జలాల ఒప్పందం ఇప్పుడు చరిత్రలోనే అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటోంది.  పహల్గామ్ ఉగ్రదాడి త‌ర్వాత‌, 2025 ఏప్రిల్‌లో భారత్ ఈ ఒప్పందాన్ని  సస్పెన్షన్లో ఉంచ‌డంతో..  2026 మే 15న హేగ్‌లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్  (పీసీఏ) ఇచ్చిన తాజా తీర్పును భార‌త్ ఓపెన్ గానే రిజెక్ట్ చేసింది. జల దౌత్యాన్ని నేరుగా భద్రత, ఉగ్రవాద సమీకరణంతో ముడిపెట్టిన ఘట్టంగా ఇది నిలిచింది. ఏది ఏమైనా ఇది నాలుగు యుద్ధాలనూ తట్టుకున్న జల దౌత్యమ‌ని చెప్పాలి. నెహ్రూ, అయూబ్ ఖాన్ ఒప్పందం, ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం.  ఆరున్నన దశాబ్దాలుగా  యుద్ధాలు, కార్గిల్, ఉగ్రదాడులు, అణు ముప్పులు కలిసి వచ్చినా నిలిచిన ఒప్పందం ఇప్పుడు.. సస్పెన్షన్‌లో ఉంది.

1960 సెప్టెంబర్ 19న కరాచీలో..  భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్, ప్రపంచ బ్యాంకు ప్రతినిధి సమక్షంలో.. సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు. అప్పటికే 1947-48 యుద్ధం ముగిసింది. ఆ తరువాత 1965, 1971, 1999 కార్గిల్ యుద్ధాలు, ఎన్నో సంక్షోభాలు వ‌చ్చినా, ఈ ఒప్పందం మాత్రం అలాగే కొనసాగింది.  

తూర్పు నదులైన‌.. సట్లెజ్, బియాస్, రావి భారత్ కి పూర్తి వినియోగ హక్కు ల‌భిస్తుండ‌గా, పశ్చిమ నదులైన.. సింధు, జీలం, చీనాబ్..నదులు పాకిస్థాన్‌కు  ఎక్స్‌క్లూజివ్ గా కేటాయించారు. భారత్‌కు పశ్చిమ నదులపై పరిమిత వినియోగం అంటే, జలవిద్యుత్, కొన్ని నిల్వ పరిమితులతో  మాత్రమే అనుమతినిచ్చారు. రాజకీయాలు, యుద్ధాలు, అణు ముప్పులు  పక్కన పెట్టి నీటిని వేరుxe చూసుకుందాం అనే అరుదైన ఒప్పందమే ఇది. ఇక పహల్గామ్ దాడి కార‌ణంగా.. రక్తం, నీరు కలిసి ప్రవహించవు  అనే  స్పష్టమైన సందేశం ఇచ్చింది భార‌త్. 2025 ఏప్రిల్ 22న  దాడి జ‌ర‌గ్గా.. 23న ఈ జ‌ల‌ ఒప్పందం ర‌ద్దు చేసింది. 
 
ఒక ఉగ్రదాడి..  తర్వాతి 24 గంటల్లో తీసుకున్న నిర్ణయాలు.. 65 ఏళ్ల జల దౌత్యాన్ని పూర్తిగా మార్చేశాయి. జమ్మూ– కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీప బైసరన్ వ్యాలీలో.. 2025 ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది హతమయ్యారు. దర్యాప్తులో క్రాస్ బోర్డర్ లింకేజెస్ స్పష్టమయ్యాయని, పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదుల పాత్ర ఇందులో ఉందని చెబుతోంది భారత ప్రభుత్వం.   ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ భ‌ద్ర‌తా సమావేశం త‌ర్వాత‌..  విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించిన నిర్ణయాలు ఎలాంటివంటే.. సింధు జలాల ఒప్పందాన్ని  అబేయెన్స్ లో ఉంచడం,  పాకిస్థాన్  శాశ్వతంగా  సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఆపేంత వరకు ఇది కొన‌సాగుతుంద‌ని తేల్చి చెప్ప‌డం వంటివి న‌మోద‌య్యాయి.  

ఇక అట్టారి, వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్ మూసివేత, పాకిస్థాన్ మిలిటరీ అటాచేలను దేశం విడిచిపోవాలని ఆదేశించడం, సార్క్ వీసా ఎగ్జెంప్షన్ పథకంలో పాకిస్థాన్ పౌరుల ప్రయాణాల నిలిపివేత.. వంటివి సైతం జ‌రిగాయి.  పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఆపేంత వరకు అనే షరతు.. ఏ కోర్టు తీర్పుతోనూ, ఏ మధ్యవర్తిత్వంతోనూ మార్చలేని రాజకీయ–భద్రతా ప్రమాణంగా మారింది. పాకిస్థాన్‌పై నీటి ఒత్తిడి విష‌యానికి వ‌స్తే.. వ్యవసాయం, ఆహార భద్రతపై దీని ప్రభావం ప‌డింది.

సింధు బేసిన్‌పై 90శాతం సాగు ఆధారపడే దేశం- పాకిస్థాన్‌కు ఇది కేవలం ఒక‌ జల ఒప్పందం కాదు.  ఆహార భద్రత, సామాజిక స్థిరత్వానికి నేరుగా ముడిపడిన జీవనాధారం. సింధు బేసిన్ ఆధారిత వ్యవసాయం అనే అంశానికి వ‌స్తే.. పాకిస్థాన్ సాగునీటి అవసరాల్లో దాదాపు 90శాతం సింధు నదీ పరీవాహక ప్రాంత  నీటిపైనే ఆధారపడినట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సింధ్, పంజాబ్ ప్రావిన్సులు ప్రధానంగా సింధు, జీలం, చీనాబ్ నదుల నీటిపై ఆధారపడిన వ్యవసాయ ప్రాంతాలు.

భారత్ రియల్ టైమ్ వరద, నీటి నిల్వల డేటా పంచుకోవడాన్ని నిలిపివేయడం, పశ్చిమ నదులపై ప్రాజెక్టులను వేగవంతం చేయడం వల్ల పాకిస్థాన్‌లో నీటి కొరత, సాగు ప్రణాళికల్లో అనిశ్చితి పెరిగిందని చెబుతున్నాయి స్థానిక నివేదికలు. సింధ్ ప్రావిన్స్‌లో 60శాతానికి పైగా నీటి కొరత నమోదైందని పాకిస్థాన్ మీడియా, నిపుణుల హెచ్చరికలు వెలువడ్డాయి కూడా. ఇది పంట దిగుబడులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. పాకిస్థాన్‌కు సైనిక ఒత్తిడి మాత్రమే కాదు.. ఆహార భద్రత కూడా భారత భూభాగంలో పుట్టే నదులపై ఆధారపడే హైడ్రో–స్ట్రాటజిక్  వాస్తవంగా త‌యారైంది. 

హేగ్ కోర్టు తీర్పు విష‌యానికి వ‌స్తే.. కిషన్‌గంగ, రాట్లే ప్రాజెక్టులపై కొత్త వివాదంగా  మారింది. పీసీఏ  తాజా నిర్ణయం, భారత  ససేమిరా అనేలాంటి వైఖరికి తార్కాణం.  భారత్ దృష్టిలో ఇది కేవలం ఒక జల వివాదం కాదు.. చట్టవిరుద్ధంగా ఏర్పడిన ట్రిబ్యునల్‌కు ఇచ్చిన రాజకీయంతో కూడిన న్యాయ సమాధానం. ఇక తాజా తీర్పు ఎలాంటిదో చూస్తే.. కిషన్‌గంగ, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులపై నీటి నిల్వ పరిమితులు, డిజైన్ అంశాలపై పాకిస్థాన్ అభ్యంతరాల ప‌రిస్థితుల్లో, హేగ్‌లోని పెర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ 2026 మే 15న ఒక కొత్త తీర్పు ఇచ్చింది.

భారత్, ఈ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను  చట్టవిరుద్ధంగా ఏర్పడినదిగా చెబుతూ.. దాని అధికారాన్ని మొదటి నుంచీ ప్రశ్నిస్తోంది.  విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో ఈ ట్రిబ్యునల్‌  భారత్ గుర్తించదనీ.. గత తీర్పుల మాదిరిగానే తాజా తీర్పును కూడా చట్టబద్ధంగా అంగీకరించబోదని, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసే నిర్ణయం అలాగే కొనసాగుతుందని స్పష్టం చేసింది. 

భారత విదేశాంగ వ్యవహారల ప్రతినిధి రణధీర్ జైస్వాల్  ఐడబ్ల్యుటి సస్పెన్షన్‌కు ముఖ్య‌ కారణం.. పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు అని, అది విశ్వసనీయంగా, శాశ్వతంగా ఆగేంత వరకు ఈ నిర్ణయం మారదని తేల్చి చెప్పారు.  ఇది కోర్టు తీర్పుతో ముగిసే వివాదం కాదు. పాకిస్థాన్ ప్రవర్తనతో మాత్ర‌మే మారుతుంది. అంతర్జాతీయ న్యాయం, జల దౌత్యం, భద్రత ఒక‌ కొత్త సమీకరణంగా  మారింది. ఐడబ్ల్యుటి  అబేయెన్స్, చట్టపరమైన సరిహద్దులు, వ్యూహాత్మక సందేశంగా త‌యారైంది. 

భారత్  అబేయెన్స్ అనే పదాన్ని ఎంచుకోవడానికి గ‌ల కార‌ణం ఏంటంటే..  ఐడబ్ల్యుటి  ప్రకారం, ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలంటే, రెండు దేశాలు కలిసి కొత్త ఒప్పందం ద్వారా మాత్రమే చేయగలవు. ఏకపక్ష రద్దుకు స్పష్టమైన మార్గం లేదు. అందుకే భారత్ విత్ డ్రా, టెర్మినేట్ అనే పదాల బదులుగా హెల్డ్ ఇన్ అబేయెన్స్ అనే పదాన్ని ఉపయోగించింది. ఇది ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన స్థితిలో ఉంచుతూ..  పాకిస్థాన్‌పై రాజకీయ వ్యూహాత్మక ఒత్తిడిని కొనసాగించే మార్గం.

నీటి ఒప్పందాన్ని కూడా భద్రతా- ఉగ్రవాద సమీకరణంలో భాగం చేయడం ద్వారా, భారత్  టెర్రరిజం, నార్మలైజేషన్ కు ఎలాంటి స్పేస్ ఇవ్వబోమని సంకేతం ఇస్తోంది. అంతర్జాతీయంగా,ఐడబ్ల్యుటి ను ఇప్పటివరకు  మోడల్ వాటర్ షేరింగ్ ట్రీటీ గా చూసిన దృక్కోణం, ఇప్పుడు  హైడ్రో స్ట్రాటజిక్ లెవరేజ్  కోణంలో కూడా చర్చకు వస్తోంది.

నెత్తురూ, నీరు ఒకేసారి ప్రవహించలేవు అనే పొలిటిక‌ల్ కామెంట్ కి, ఇప్పుడు జల దౌత్యంలోనూ స్పష్టమైన పాలసీ రూపం వచ్చింది.  శాశ్వత విరామమా, లేక షరతులతో కూడిన పునరుద్ధరణా? అన్న విష‌యానికి వ‌స్తే.. సింధు జలాల ఒప్పందం భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా పాకిస్థాన్ ప్రవర్తన, ప్రాంతీయ భద్రతా వాతావరణం, అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలపై ఆధారపడి ఉంది.

పాకిస్థాన్, సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతును శాశ్వతంగా ఆపిందని భారత్ అంగీకరించే స్థితి వస్తే, ఐడబ్ల్యుటి  పునరుద్ధరణకు ఒక దారి దొరుకుతుంది. అదే సమయంలో..  పశ్చిమ నదులపై భారత ప్రాజెక్టులు, నీటి వినియోగం పెరుగుతూ పోతే, పాకిస్థాన్‌కు జల, ఆహార భద్రత ఒత్తిడి మరింత పెరిగే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానాలు, మధ్యవర్తిత్వ సంస్థలు ఈ వివాదాన్ని పరిష్కరించలేవు. భారత షరతు స్వభావం అలాంటిది.  భారత్ ఇస్తున్న సందేశం ఎంతో స్పష్టం. సరిహద్దు దాటి ఉగ్రవాదం కొనసాగుతూనే ఉంటే, సరిహద్దు దాటి నీటి ప్రవాహం  కొనసాగుతుందన్న గ్యారంటీ లేదు. ఈ ఒక్క విష‌యం అర్ధ‌మైతే చాలు.. ఈ వ్య‌వ‌హారం మొత్తం క్లియ‌ర్ క‌ట్ గా తెలిసిపోతుంది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.   

google-ad-img
    Related Sigment News
    • Loading...