జలదిగ్బంధంలో వరంగల్ నగరం
posted on: Oct 30, 2025 9:34AM

మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరం తడిసిముద్దైంది. నగరంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బుధవారం (అక్టోబర్ 29) రోజంత ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో నగరంలోని రోడ్లు నదులను తలపించాయి. వర్షం తగ్గుముఖం పట్టినా వరద ఉధృతి తగ్గలేదు. ప్రధాన రహదారులతో పాటు అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షం తగ్గుముఖం పట్టినా వరద ఉద్ధృతి తగ్గకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.
నగరంలోని దాదాపు 45 కాలనీలు జలమయమయ్యాయి. ఈ కాలనీలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. సాయిగణేశ్ కాలనీ, సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్‌ఎన్ నగర్, మైసయ్యనగర్ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది.
ఎస్ డీఆర్ఎఫ్ బృందాలు యుద్ధ ప్రతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. ముంపునకు గురైన ప్రాంతాల నుంచి ప్రజలను పడవలలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నగరంలో మొత్తం 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు 1200 మందిని వాటిలోకి తరలించారు.
భారీ వర్షాల కారణంగా బొందివాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వరంగల్, హనుమకొండ మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి వరదల తీవ్రత దృష్ట్యా, ముందుజాగ్రత్త చర్యగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.



.webp)


