Latest News
కాదు కాదంటూనే ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటన!
posted on: Mar 23, 2026 5:07PM

ఇరాన్ తో జరుగుతున్నయుద్ధంపై అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇది దాదాపు యుద్ధ విరమణ ప్రకటనలాగే ఉంది. ఇరాన్ పై యుద్ధంలో తమ లక్ష్యాలు దాదాపు నెరవేరినందున ఇరాన్ పై దాడుల తీవ్రతను తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది యుద్ధ విరమణగా భావించవద్దని ట్రంప్ పేర్కొన్నప్పటికీ.. కాల్పుల విరమణ కాదని స్పష్టం చేసినప్పటికీ ప్రపంచ దేశాలలో, యుద్ధ నిపుణులలో మాత్రం ట్రంప్ వెనకడుగు వేశారన్న అభిప్రాయమే వ్యక్తం అవుతోంది. ఇరాన్ ఇప్పుడు పూర్తిగా కుప్పకూలుతోందనీ, ఈ పరిస్థితుల్లో యుద్ధ విరమణ ఉండదనీ ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇరాన్ అమెరికా దాడులను ప్రతిఘటిస్తున్న తీరు చూస్తుంటే.. ట్రంప్ ప్రకటన మేకపోతు గాంభీర్యం అన్న చందంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడం, మిత్రదేశాల రక్షణ వంటి అమెరికా ప్రధాన లక్ష్యాలు దాదాపుగా నెరవేరడం వల్లనే దాడుల తీవ్రతను తగ్గిస్తున్నామని ట్రంప్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే హర్మూజ్ జలసంధి విషయంలో ట్రంప్ హెచ్చరికను ఖాతరు చేయబోమని ఇరాన్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ట్రంప్ యుద్ధ ముగింపు ప్రకటన చేయడంతో అమెరికా వెనకడుగు వేసిందన్న అభిప్రయామే కలుగుతోందని అంటున్నారు. ఏది ఏమైనా ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.


.webp)



