Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వార్ ఎఫెక్ట్.. ఏయే దేశాలకు ఎంతెంత?
posted on: Apr 4, 2026 3:45PM

ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఏ ఒక్క దేశమో కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వేర్వేరు స్థాయిల్లో నష్టపోతున్నాయి. అయితే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారో చూస్తే..
ఈ యుద్ధం వల్ల ఇరాన్ ప్రత్యక్ష నరకాన్ని, భారీ నష్టాన్ని చవిచూస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ ఇంధన కేంద్రాలు, సైనిక స్థావరాలు.. దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇరాన్ కరెన్సీ- రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. ద్రవ్యోల్బణం 40శాతం దాటిపోయింది, దీనివల్ల సామాన్యులకు నిత్యావసర వస్తువులు అందనంత భారమయ్యాయి. యుద్ధం వల్ల దేశంలో ఇప్పటికే ఉన్న నిరసనలు, ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగాయి.
ఆ తర్వాత భారీగా నష్టపోతున్న దేశం ఇజ్రాయెల్. ఇరాన్ ప్రయోగించిన మిస్సైళ్ల వల్ల ఇజ్రాయెల్ నగరాల్లో.. భారీ ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇక్కడ తామెంత నరకం అనుభవిస్తున్నామో తమకే తెలుసంటున్నారు ఇజ్రాయెలీలు. నిరంతరం సైరన్లు, బంకర్లలో గడపాల్సి రావడం వల్ల.. ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. రక్షణ వ్యవస్థలు మరీ ముఖ్యంగా.. ఐరన్ డ్రోమ్ వంటి వాటి నిర్వహణకు, యుద్ధానికి ఇజ్రాయెల్ భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఇతర దేశాల పరిస్థితి ఏంటో చూస్తే.. ఈ యుద్ధంతో సంబంధం లేని దేశాలు కూడా.. ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇరాన్- స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మార్గాన్ని మూసివేయడంతో ప్రపంచ ముడి చమురు సరఫరాలో 20శాతం నిలిచిపోయింది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా ఆకాశాన్ని అంటాయి. ఇక ఆసియా దేశాలపై పడుతున్న భారం ఎలాంటిదో చూస్తే.. చమురు దిగుమతుల కోసం మధ్య ప్రాచ్యంపై ఆధారపడే.. భారత్, చైనా, జపాన్ వంటి దేశాలు ఇంధన ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎరువుల తయారీకి అవసరమైన గ్యాస్ సరఫరా తగ్గడంతో, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగే ప్రమాదం ఏర్పడింది.
అమెరికా తన సైనిక శక్తిని వాడటంతో పాటు, తన యుద్ధ విమానాలను- కోల్పోవడం, సైనిక ఖర్చులు పెరగడం వంటి నష్టాలను ఎదుర్కొంటోంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఇరాన్ తన ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాల పరంగా నేరుగా నష్టపోతుంటే, మిగిలిన ప్రపంచ దేశాలు పెరిగిన చమురు ధరలు, ఆర్థిక మాంద్యం భయంతో పరోక్షంగా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయి.
మొత్తంగా ఏయే దేశాలకు అంకెల్లో చూపితే ఎంతెంత ఆర్ధిక భారం పడుతోంది.. మరీ ముఖ్యంగా ఇరాన్ ఖర్చు ఎంత? ఇజ్రాయెల్ ఎంత? అమెరికా ఎంత? అని పరిశీలిస్తే.. 2026 ఏప్రిల్ నాటి తాజా అంచనాల ప్రకారం, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల జరిగిన ఆర్థిక నష్టాలు భయానకంగా కనిపిస్తున్నాయి. కేవలం యుద్ధం చేస్తున్న దేశాలే కాకుండా, ప్రపంచం మొత్తం దీని భారాన్ని మోస్తోంది. మరీ ముఖ్యంగా.. అమెరికా అయితే ఈ యుద్ధం కోసం రికార్డు స్థాయిలో ఖర్చు చేస్తోంది. రోజువారీగా యుద్ధ కార్యకలాపాల కోసం రోజుకు సుమారు 2 బిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో చెబితే సుమారు రూ. 16 వేల 600 కోట్లు ఖర్చవుతోందని చెబుతున్నాయి నివేదికలు. యుద్ధం మొదలైన మొదటి 12 రోజుల్లోనే అమెరికా 16.5 బిలియన్ డాలర్ల ఖర్చు చేసింది. ఏప్రిల్ మొదటి వారం నాటికిది పాతిక బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ మొత్తం ఇండియన్ కరెన్సీలో చెబితే సుమారు రూ. 2.1 లక్షల కోట్లుగా ఉంది. యుద్ధం వల్ల ఏర్పడిన ఆయుధాల కొరతను తీర్చడానికి అమెరికా- 2027 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 1.5 ట్రిలియన్ డాలర్ల భారీ రక్షణ బడ్జెట్‌ను ప్రతిపాదించింది.
ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే.. ఇజ్రాయెల్ తన ఉనికిని కాపాడుకోవడానికి భారీగా ఖర్చు చేస్తోంది. 2026 సంవత్సరానికి ఇజ్రాయెల్ రక్షణ బడ్జెట్ 34.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ఇజ్రాయెల్ షెకెల్స్ లో చెబితే.. సుమారు 112 బిలియన్ షెకెల్స్ గా తెలుస్తోంది. ఇరాన్ దాడులను తిప్పికొట్టడానికి వాడే ఐరన్ డోమ్, ఆరో వ్యవస్థల కోసం ఒక్కో రాత్రికి వందల మిలియన్ల డాలర్లు ఖర్చవుతున్నాయి. యుద్ధం వల్ల టూరిజం, టెక్నాలజీ రంగాలు బాగా దెబ్బతిని దేశ జీడీపీ వృద్ధి గణనీయంగా తగ్గింది.
ఈ మొత్తం యుద్ధంలో ఇరాన్ అసలైన బాధిత దేశం. ఇరాన్ తన మౌలిక సదుపాయాలను కోల్పోవడంతో పాటు.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ యుద్ధం వల్ల ఇరాన్ రియాల్ విలువ పడిపోయింది, ద్రవ్యోల్బణం 40శాతం పైగా ఉందని ముందే చెప్పుకున్నాం. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ చమురు శుద్ధి కర్మాగారాలు, విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. వీటిని తిరిగి నిర్మించడానికి వందల బిలియన్ డాలర్లు అవసరమవుతాయి. చమురు ఎగుమతులు నిలిచిపోవడంతో రోజుకు కొన్ని వందల మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోతోంది ఇరాన్.
భారత్ వంటి ఇతర దేశాలపై ఈ యుద్ధ ప్రభావం ఎలా ఉందో చూస్తే, ఇది పైకి తెలీదు. కానీ, లోలోన కార్చిచ్చులా ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీస్తుందనే చెప్పాలి. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మూసివేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాలో 11శాతం అంటే, రోజుకు 1.1 కోట్ల బారెల్స్ కొరత ఏర్పడింది. గత నెలలోనే పెట్రోల్ ధరలు సుమారు 10 శాతం, డీజిల్ ధరలు 20 శాతం పెరిగాయి. ప్రపంచ ఎరువుల సరఫరాలో 12 శాతం ఈ ప్రాంతం నుంచే వస్తుంది. యుద్ధం వల్ల గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో ఎరువుల ధరలు పెరిగి భారత్ వంటి వ్యవసాయ దేశాలపై భారం పడుతోంది. ఈ గణాంకాలు ప్రస్తుత యుద్ధ తీవ్రతను బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఈ యుద్ధం మరింత కాలం కొనసాగితే ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు 0.3 శాతం నుండి 1శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరించింది.



.webp)


